అక్టోబర్ నెల నుంచి పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు
భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కారు ఎగుమతిదారు మరియు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) దేశీయ విపణిలో అందిస్తున్న అన్ని మోడళ్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో, అక్టోబర్ 1, 2013 నుంచి హ్యుందాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఇయాన్ మొదలుకొని శాంటాఫే వరకు అన్ని కార్ల ధరలు రూ.20,000 మేర (మోడల్‌ను బట్టి) పెరగనున్నాయి.
అయితే, కంపెనీ ఇటీవల విడుదల చేసిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ధరను మాత్రం పెంచబోమని కంపెనీ స్పష్టం చేసింది. కాగా.. ఏయే మోడల్‌పై ఎంత మేర ధరను పెంచనున్న విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
రూపాయి విలువ క్షీణత, ద్రవ్యోల్బణ తీరు తమ ఉత్పత్తి వ్యయంపై ప్రభావాన్ని చూపాయని, ఇప్పటికే తాము చాలా ఖర్చును భరించామని, ఇక చేసేది లేక అక్టోబర్ 1, 2013వ తేదీ నుంచి వివిధ ఉత్పత్తులపై రూ.4,000 నుంచి రూ.20,000 మేర ధరలను పెంచుతున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు.

ఇదిలా ఉండగా, టొయోటా ఈనెల 21వ తేదీ నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసినదే. మరోవైపు జనరల్ మోటార్స్, హోండా, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి పలు ఆటోమొల్ కంపెనీలు కూడా ఇవే కారణాల చేత ధరలను పెంచేందుకు సిద్ధమవుతుండా, మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ధరలను పెంచేశాయి.


Click it and Unblock the Notifications








