2014 ఇండియన్ గ్రాండ్ ప్రి జరిగేది సందేహమే!
గడచిన 2011 సంవత్సరం చివర్లో భారతదేశంలోనే తొలిసారిగా ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్ ప్రారంభమైన సంగతి తెలిసినదే. అప్పటి వరకు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ మోటార్‌స్పోర్ట్ ఆ సంవత్సరంలో ఇండియాలోకి కూడా ప్రవేశించింది. ఈ ఫార్ములా వన్ రేస్ కోసం న్యూఢిల్లీకి సమీపంలో ఉన్న గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ రేస్ సర్క్యూట్‌ను ప్రపంచ ప్రమాణాలకు అనువుగా తీర్చిద్దారు.
గడచిన సంవత్సరంలో కూడా ఈ రేస్ ట్రాక్‌పై నిర్వహించిన 2012 ఇండియన్ గ్రాండ్ ప్రికు మంచి క్రేజ్ లభించింది. దేశవిదేశాల నుంచి ఫార్ములా వన్ అభిమానులు మన దేశానికి చేరుకున్నారు. ఫలితంగా ఖజానాకు మంచి ఆదాయాలే లభించాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలో భారత్‌లో మూడవ సిరీస్ 2013 ఇండియన్ గ్రాండ్ ప్రి జరగనుంది. అయితే, ఈ 2013 ఎఫ్ రేస్ తర్వాత మన దేశంలో ఇండియన్ గ్రాండ్ ప్రి జరిగే అవకాశాలు కనిపించడం లేదు. భారత్‌లో 2014 ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్ సందేహకరంగా మారింది.

ఈ విషయాన్ని స్వయంగా ఎఫ్1 సుప్రీమో బెర్నీ ఎక్లెస్టోన్ (Bernie Ecclestone) స్వయంగా వెల్లడించారు. పన్నుల (టాక్స్) సమస్య ఇందుకు ప్రధాన కారణని తెలుస్తోంది. భారతదేశం ఎఫ్1ను ఓ క్రీడ (స్పోర్ట్)గా పరిగణించకపోవటం, ఫలితంగా మనదేశంలోకి ప్రవేశించే ఫార్ములా వన్ జట్లకు భారత ప్రభుత్వం కస్టమ్స్ రాయితీని మంజూరు చేయకపోవటం కారణంగా సదరు జట్లపై అధిక పన్ను భారం పడుతోంది.
హంగేరీ గ్రాండ్ ప్రిలో ఎక్లెస్టోన్ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాదిలో ఇండియాలో గ్రాండ్ ప్రి జరుగుతుందా అన్న ప్రశ్నకు ఆయన బహుశా జరగకపోవచ్చని సమాధానమిచ్చారు. ఇది చాలా రాజకీయంతో కూడుకున్నదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఫార్ములా వన్ ఆర్గనైజర్లు మాత్రం ఈ వ్యాఖ్యలు నిరాధారమైనవని, అర్థం లేనివని ఈ వార్తను కొట్టిపారేస్తున్నాయి. కాగా.. 2014 ఫార్ములా వన్ రేస్‌లో రష్యా, ఆస్ట్రేలియా జట్లు కూడా పాల్గొనబోతున్నాయి.


Click it and Unblock the Notifications








