అఫీషియల్: 2014 ఇండియన్ గ్రాండ్ ప్రి రద్దు
వచ్చే సంవత్సరం భారతదేశంలో నాల్గవ సిరీస్ ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్ జరగటం సందేహమేనని వస్తున్న వార్తలు నిజం అని తేలాయి. 2014 ఇండియన్ గ్రాండ్ ప్రి బహుశా జరగకపోవచ్చని ఎఫ్1 సుప్రీమో బెర్నీ ఎక్లెస్టోన్ చెప్పిన సంగతి తెలిసినదే. కాగా.. ఇదే విషయాన్ని జైపీ స్పోర్ట్స్ ఇంటర్నేషన్ ధృవీకరించింది. భారత్‌లో నాల్గవ సీరిస్ ఫార్ములా వన్ రేస్‌ను నిర్వహించబోమని, దీనిని 2015 ప్రథమార్ధంలో ఏదో ఒక సమయంలో నిర్వహిస్తామని జైపీ పేర్కొంది.
జైపీతో 5 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు తాము ప్రతి సంవత్సరం ప్రథమార్ధంలో ఇండియాకు రావాలని నిర్ణయించుకున్నామని, అయితే, జైపీ మాత్రం దీనిని అక్టోబర్‌లో నిర్వహించాలని నిర్ణయించిందని, ఈ నేపథ్యంలో నాల్గవ సిరీస్ రేస్‌ను 2015 ఆరంభంలో నిర్వహిస్తామని ఎక్లెస్టోన్ అన్నారు.
కాగా.. ఇదే విషయంపై జైపీ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ స్పందిస్తూ, అక్టోబర్-నవంబర్ సమయంలో ఫార్ములా వన్ రేసుకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని, పైగా అది పండుగ సీజన్ కూడా కావటంతో దీనికి మంచి క్రేజ్ ఉంటుందని తెలిపింది. అయితే, ఫార్ములా వన్ మేనేజ్‌మెంట్ (ఎఫ్ఓఎమ్) ఈసారి రేస్‌ను మార్చ్ 2015లో నిర్వహించాలని కోరిందని, అందుకు తమకు ఎలాంటి సమస్య లేదని జైపీ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ గౌర్ తెలిపారు.

గడచిన 2011 సంవత్సరం చివర్లో భారతదేశంలోనే తొలిసారిగా ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్ ప్రారంభమైంది. అప్పటి వరకు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ మోటార్‌స్పోర్ట్ ఆ సంవత్సరంలో ఇండియాలోకి కూడా ప్రవేశించింది. ఈ ఫార్ములా వన్ రేస్ కోసం న్యూఢిల్లీకి సమీపంలో ఉన్న గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ రేస్ సర్క్యూట్‌ను ప్రపంచ ప్రమాణాలకు అనువుగా తీర్చిద్దారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో భారత్‌లో మూడవ సిరీస్ 2013 ఇండియన్ గ్రాండ్ ప్రి జరగనుంది.


Click it and Unblock the Notifications