4.4 మిలియన్ డాలర్ లాంబోర్గినీ వెనెనో రోడ్‌స్టర్ కన్ఫర్మ్!
లాంబోర్గినీ.. ఈ పేరు వినగానే మనకు ఇటాలియన్ సూపర్ కార్లు గుర్తుకు వస్తాయి. అత్యంత అరుదైన, ఖరీదైన సూపర్ స్పోర్ట్స్ కార్లను తయారు చేయడంలో లాంబోర్గినీ బాగా చేయి తిరిగిన కంపెనీ. ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్లకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ కార్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలుదారులు ఏళ్ల తరబడైనా వేచి ఉండేందుకు సిద్ధంగా ఉంటారు.
ఈ ఏడాది ఆరంభంలో లాంబోర్గినీ విడుదల చేసిన హైపర్‌కారు 'వెనెనో'లో ఓపెన్ టాప్ వెర్షన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వస్తున్న పుకార్లకు ఇప్పుడు తెరపడింది. ఇందులో టాప్‌లెస్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తామని కంపెనీ సీఈఓ స్టీఫన్ వింకెల్‌మ్యాన్ కార్ అండ్ డ్రైవర్ అనే మ్యాగజైన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ధృడమైన రూఫ్ కలిగిన లాంబోర్గినీ వెనెనో సూపర్ కారును కేవలం మూడు యూనిట్లు మాత్రమే తయారు చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఈ ఓపెన్ టాప్ వెర్షన్‌ను (ఈ కారును లాంబోర్గినీ వెనోనో రోడ్‌స్టర్ అని పిలువనున్నారు) మాత్రం అందుకు మూడు రెట్లు (9 వెనెనో రోడ్‌స్టర్) కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.
ఈ టాప్‌లెస్ బ్యూటీ ధర మాత్రం రెగ్యులర్ వెర్షన్ ధర కన్నా ఎక్కువగా ఉండనుంది. దీని ధర సుమారూ 4.4 మిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా. రూఫ్ వెర్షన్ వెనెనో ధరతో పోల్చుకుంటే ఇది దాదాపు 10 శాతం ఎక్కువ. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2013 జెనీవా మోటార్ షోలో లాంబోర్గినీ తమ వెనెనో కారును ఆవిష్కరించింది.

లాంబోర్గనీ నుండి లభిస్తున్న కార్లలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే కారుగా వెనెనో నిలువనుంది. 20వ శతాబ్ధానికి చెందిన ఫైటింగ్ బుల్స్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కారుకు వెనెనో అనే పేరును పెట్టారు. ఈ కారును లాంబోర్గినీ అవెంటేడర్ మోడల్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. దీని ఛాస్సిస్, బాడీలను కార్బనే ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్ (సిఎఫ్ఆర్‌పి)లతో తయారు చేశారు.
లాంబోర్గినీ వెనెనోలో శక్తివంతమైన 6.5 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు (అవెంటేడర్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు అయితే, ఈ ఇంజన్‌ను కొద్దిగా రీట్యూన్ చేశారు). ఈ ఇంజన్ గరిష్టంగా 750 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఈ శక్తి అవెంటేడర్‌లో ఉపయోగించిన ఇంజన్ కన్నా 50 పిఎస్‌లు అధికం. ఈ ఇంజన్‌ను 7-స్పీడ్ రోబోటైజ్డ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.



Click it and Unblock the Notifications








