అక్టోబర్ నెల నుంచి పెరగనున్న మహీంద్రా కార్ల ధరలు
దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న వాహనాలను వచ్చే నెల మరింత ప్రియం కానున్నాయి. అధిక ఉత్పాదక వ్యయం, రూపాయి విలువ క్షీణత, ముడి సరుకుల ధరల పెరుగుదల వంటి కారణాల వలన ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్యాసింజర్ వాహనాల ధరలనే కాకుండా, వాణిజ్య వాహనాల ధరలను కూడా 2 శాతం మేర పెంచనున్నట్లు ఎమ్ అండ్ ఎమ్ తెలిపింది.
తాజా పెంపుతో మహీంద్రా వాహనాల ధరలు మోడల్‌ను బట్టి రూ.6,000 నుంచి రూ.20,000 వరకు పెరిగే ఆస్కారం ఉంది. పెంచిన ధరలు అక్టోబర్ 1, 2013వ తేది నుంచి అమల్లోకి వస్తాయని మహీంద్రా వివరించింది. ఇప్పటి వరకు ఈ భారాన్ని భరిస్తూ వచ్చామని, ప్రస్తుతం తాము భరించలేని స్థాయికి చేరుకుందని, అందుకే వేరే మార్గం లేక ధరలను పెంచుతున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీన్ షా తెలిపారు.

మరోవైపు దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా అక్టోబర్ మొదటి వారం నుంచి తమ ఉత్పత్తుల ధరలను రూ.10,000 మేర పెంచనున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసినదే. ఇదే బాటలో, హ్యుండయ్ మోటార్ ఇండియా, జనరల్ మోటార్స్ ఇండియా కూడా ఈ నెల ఆరంభంలోనే ధరల పెంపును ప్రకటించగా, దేశీయ ఆటో టాటా మోటార్స్ కూడా ధరల పెంపు ప్రతిపాదనతో వడ్డింపు సిద్ధంగా ఉంది. టయోటా కిర్లోస్క్ మోటార్స్ కూడా ఇటీవలనే మోడల్‌ను బట్టి ధరలను సుమారు రూ.24,000 మేర ధరలను పెంచింది.


Click it and Unblock the Notifications








