మహీంద్రా ఎక్స్‌యూవీ500లో సమస్యలు; రీకాల్
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ గ్లోబల్ ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ500'కు భారీ షాక్ తగిలింది. అతి తక్కువ సమయంలో కొనుగోలుదారుల నుంచి అశేష ఆదరణ పొందిన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇప్పుడు సమస్యలో చిక్కుకుంది. ఈ కారులో కొన్ని లోపపూరితమైన విడిభాగాలను అమర్చిన కారణంగా, వాటిని రీప్లేస్ చేసేందుకు కంపెనీ ఎమ్ అండ్ ఎమ్ ఈ కార్లను వెనక్కు (రీకాల్) పిలిపిస్తోంది.
గడచిన 2011-12 మధ్య కాలంలో ఉత్పత్తయిన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలలో ఫ్లూయిడ్ హోస్, ఫ్రంట్ పవర్ విండో యూనిట్స్, లెఫ్ట్ వైపర్ కవర్‌లలో సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు రావటంతో ఈ పార్ట్‌లను ఉచితంగా రీప్లేస్ చేసేందుకు కంపెనీ తక్షణమే ఈ మోడళ్లను రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దాదాపు 55,000 లకు పైగా మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలు భారత రోడ్లపై పరుగులు పెడుతున్నాయి.
కాగా.. ఈ రీకాల్ గురించి తమ వినియోగదారులకు ప్రత్యేకంగా తెలియజేస్తామని, కొత్తగా ఉత్పత్తి చేస్తున్న కార్లలో ఈ సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 విషయానికి వస్తే, ఇది మూడు వేరియంట్లలో (డబ్ల్యూ6 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఆల్ వీల్ డ్రైవ్) లభిస్తోంది. ప్రస్తుతం దేశీయ విపణిలో దీని ధరలు రూ.11.8 లక్షల నుంచి రూ.14.4 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కారులో పవర్‌ఫుల్ 2.2 లీటర్ ఎమ్‌హాక్ 140 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది.
ఈ ఇంజన్‌లో ఉపయోగించిన 5వ తరం (ఫిఫ్త్ జనరేషన్) వేరియబల్ టర్బోఛార్జర్ ద్వారా ఇది కేవలం 5.4 సెకండ్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ప్రతి లీటరుకు 15 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజ్‌ను ఇస్తుంది. ఎమ్ అండ్ ఎమ్ తమ ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని తొలిసారిగా సెప్టెంబర్ 2011లో కేవలం రూ.10.8 లక్షల ప్రారంభ ధరకే మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఇది హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది.


Click it and Unblock the Notifications








