మారుతి ఆల్టో, వ్యాగన్ఆర్, ఏ-స్టార్‌లలో డీజిల్ వెర్షన్స్!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం తక్కువ ధర కలిగిన కార్లకు మంచి డిమాండ్ ఉంటోంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కార్ కంపెనీలు ఇప్పుడు సరికొత్త కాంపాక్ట్ కార్లు, చిన్న డీజిల్ ఇంజన్ కలిగిన కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. హ్యుందాయ్ వచ్చే నెలలో తమ తొలి కాంపాక్ట్ డీజిల్ కారు ఐ10 గ్రాండ్‌ను విడుదల చేస్తానని ప్రకటించిందిన సంగతి తెలిసినదే.
మారుతి సుజుకి నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకే హ్యుందాయ్ ఈ కొత్త మోడల్‌ను పరిచయం చేస్తోంది. అయితే, ఈ సెగ్మెంట్లో హ్యుందాయ్ నుంచి ఎదురు కాబోయే పోటీని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఇటు మారుతి కూడా సిద్ధమవుతోంది. చిన్న కార్లలో ఉపయోగించేందుకు మారుతి సుజుకి ఓ 800సీసీ డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తోంది.

మారుతి సుజుకి వైఎల్7 అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న గ్లోబల్ స్మాల్ కారులో ఈ ఇంజన్ ఉపయోగించనున్నారు. అంతేకాకుండా, కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన ఆల్టో కారులో కూడా ఈ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు తాజా సమాచారం.
మారుతి సుజుకి అప్‌గ్రేడెడ్ ఆల్టో 800ను మార్కెట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఈ మోడల్ అమ్మకాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆల్టో బ్రాండ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇందులో డీజిల్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కాకుండా, కంపెనీ అందిస్తున్న పెట్రోల్ కార్లు వ్యాగన్ఆర్, ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్‌లలో కూడా డీజిల్ వెర్షన్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో అధిక వాటా పెట్రోల్ కార్లదే. మారుతి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్, హ్యుందాయ్ శాంత్రో, టాటా నానో వంటి పెట్రోల్ కార్లు మార్కెట్‌ను ఏలుతున్నాయి. ఈ నేపథ్యంలో, కొత్తగా రానున్న మారుతి, హ్యుందాయ్ డీజిల్ కార్లతో ఈ సెగ్మెంట్లో అమ్మకాలు మరింత పెరిగే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








