మారుతి సుజుకి ఏ-స్టార్ ఖేల్ ఖతమ్.. దుకాణం బంద్..
భారతదేశపు నెంబర్ వన్ కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, దేశీయ మరో కారు ఉత్పత్తి శుభం కార్డు వేయనుంది. అమ్మకాలు సరిగ్గా లేని కారణంగా ఇటీవలే మారుతి ఎస్టిలో కారు ఉత్పత్తిని నిలిపి వేసిన మారుతి సుజుకి, తాజాగా ఏ-స్టార్ కారు ఉత్పత్తిని కూడా నిలిపి వేయనున్నట్లు సమాచారం. భారత మార్కెట్లో ఏ-స్టార్ పేరుతో అమ్ముడుపోతున్న ఈ కారు విదేశాల్లో ఆల్టో పేరుతో విక్రయించబడుతోంది.
నిస్సాన్ యూరప్‌తో మారుతి సుజకి ఇండియాకు ఉన్న కాంట్రాక్ట్‌లో భాగంగా ఏ-స్టార్ కారు యూరప్ మార్కెట్లో పిక్సో పేరుగా కూడా అమ్ముడుతోపుంది. భారత మార్కెట్లో ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు. అయితే గ్లోబల్ మార్కెట్లలో మాత్రం దీని హవా కొనసాగుతూనే ఉంది. కేవలం ఎగుమతుల సంఖ్య కారణంగా ఈ మోడల్ ఇప్పటికీ భారత మార్కెట్లో సజీవంగా ఉందని చెప్పాలి.

గడచిన సెప్టెంబర్ నెలలో మారుతి సుజుకి 7171 యూనిట్ల ఏ-స్టార్ కార్లను ఉత్పత్తి చేయగా, అందులో 6500 యూనిట్లను ఎగుమతి చేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, నిస్సాన్ యూరప్ ఏ-స్టార్/పిక్సో కారును దిగుమతి చేసుకోవటం నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఎగుమతులు కూడా దెబ్బతినడంతో ఈ మోడల్‌ను ఉత్పత్తి చేయటం కంపెనీకి ఆర్థికంగా లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఏ కోశాన కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో, ఏ-స్టార్ ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీ యోచిస్తోంది. అయితే, మార్కెట్ నుంచి ఏ-స్టార్ వెళ్లిపోతున్నందకు చింతించాల్సిన అవసరం లేదు. దాని స్థానంలో మరో సరికొత్త కారు (వైఎల్7 కోడ్ నేమ్)ను మారుతి సుజుకి ప్రవేశపెట్టనుంది. నెక్స్ట్ జనరేషన్ ఆల్టోగా రానున్న ఈ కారును ఏ-స్టార్‌నే కాకుండా ఎస్టిలోను కూడా భర్తీ చేయనున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








