భారత మార్కెట్లో మారుతి గ్రాండ్ విటారా అమ్మకాలు బంద్!
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి దేశీయ విపణిలో విక్రయిస్తున్న వన్ అండ్ ఓన్లీ ఎస్‌యూవీ 'గ్రాండ్ విటారా' అమ్మకాలను కంపెనీ పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం. భారత మార్కెట్లో ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు. భారత్‌లో లభిస్తున్న గ్రాండ్ విటారా ఎస్‌యూవీని మారుతి సుజుకి మాతృ సంస్థ, జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ అభివృద్ధి చేసింది.
సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో మారుతి ఈ ఎస్‌యూవీని ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించడం జరుగుతోంది. అందుకే దేశీయ విపణిలో దీని ధరలు రూ.22.68 లక్షల నుంచి రూ.24.60 లక్షల రేంజ్‌లో (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉండేవి. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.6 లక్షల నుంచే యుటిలిటీ వాహనాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో, కొనుగోలుదారులు ఇంత మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

కంపెనీ అందిస్తున్న లగ్జరీ సెడాన్ కిజాషి విషయంలో కూడా ఇలానే జరిగింది. ఈ ఖరీదైన కారు కేవలం పెట్రోల్ ఆప్షన్‌తోనే లభించేది. దీని అమ్మకాలు కూడా ప్రతినెలా ఒక అంకె సంఖ్యను దాటలేదు. అందుకే కంపెనీ ఈ మోడల్‌ను నిలిపివేసింది. అలాగే, గ్రాండ్ విటారా ఎస్‌యూవీ కూడా కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో, మ్యాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లతో అందుబాటులో ఉండేది.
ఏదేమైనప్పటికీ, ప్రస్తుతానికి కంపెనీ ఈ గ్రాండ్ విటారా ఎస్‌యూవీని భారత మార్కెట్ నుంచి తొలగించినప్పటికీ, దీని స్థానంలో త్వరలోనే ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. కొత్తగా వచ్చే గ్రాండ్ విటారా డీజిల్ వెర్షన్‌తో కూడా లభ్యమయ్యే ఆస్కారం ఉంది. అంతేకాకుండా, ఈ కొత్త గ్రాండ్ విటారా ఎస్‌యూవీని భారత మార్కెట్లోనే అసెంబ్లింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సమచారం.

ఇదిలా ఉండగా, సుజుకి మోటార్ కార్పోరేషన్ గడచిన సంవత్సరం జులై నెలలో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ గ్రాండ్ విటారా ఎస్‌యూవీన జపాన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇదే ఎస్‌యూవీని ఇండియాకు తీసుకువచ్చేందుకు మారుతి సుజుకి సన్నాహాలు చేస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. గ్రాండ్ విటారా ఎస్‌యూవీ జపనీస్ మార్కెట్లో ఎస్కుడో (Escudo) అనే పేరుతో లభ్యమవుతోంది.
కొత్త 2013 వెర్షన్ సుజుకి గ్రాండ్ విటారాలో సరికొత్త ఫ్రంట్ డిజైన్, రీడిజైన్ చేయబడిన గ్రిల్ (హనీకోంబ్ డిజైన్ కలిగిన గ్రిల్), బంపర్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ విభిన్న డ్రైవింగ్ మోడ్స్ వంటి అనేక మార్పులతో ఇది లభ్యమవుతుంది. ఇందులో అమర్చిన 2.4 లీడర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 165 పిఎస్‌ల శక్తిని, 225 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.


Click it and Unblock the Notifications








