ఎస్ఎక్స్4, కరోలా ఆల్టిస్, సివిక్ సెడాన్లపై 'టాక్స్ కట్'
భారత ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్‌లో 1500సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం, 4 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు, 170 మి.మీ. లేదా అంతకన్నా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన కార్లను పెద్దవాహనాలు లేదా ఎస్‌యూవీలుగా పరిగణించి వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని 27 శాతం నుంచి 30 శాతానికి పెంచిన సంగతి తెలిసినదే.
ఈ తాజా ప్రమాణాల కారణంగా టొయోటా కరోలా ఆల్టిస్, మారుతి సుజుకి ఎస్ఎక్స్4, హోండా సివిక్ వంటి సెడాన్ కార్లు కూడా పెద్ద వాహనాల పరిధిలోకి రావటం, వాటిపై 30 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో, వివిధ కార్ కంపెనీలు ఎక్సైజ్ సుంకం పెంపు విషయంలో కార్లను పరిగణలోకి తీసుకునే విషయాన్ని మరోసారి పునఃపరిశీలించాల్సిందిగా కోరాయి.
కాగా.. ఇప్పుడు కార్ కంపెనీల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ 3 మోడళ్లను (టొయోటా కరోలా ఆల్టిస్, మారుతి సుజుకి ఎస్ఎక్స్4, హోండా సివిక్) సెడాన్లుగానే పరిగణించి వీటిపై 27 శాతం ఎక్సైజ్ సుంకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సిబిఈసి) వెల్లడించింది.



Click it and Unblock the Notifications








