మెర్సిడెస్ బెంజ్ కాంపాక్ట్ లగ్జరీ కార్లకు భారీ డిమాండ్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న కాంపాక్ట్ లగ్జరీ కార్లకు గిరాకీ జోరందుకుంది. భారత మార్కెట్లో కంపెనీ అందిస్తున్న ఏ-క్లాస్, బి-క్లాస్ మోడళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, జర్మనీలోని తమ మాతృ ప్లాంట్ నుంచి భారత్‌కు కేటాయించే ఈ మోడళ్ల సంఖ్యను మరింత పెంచాల్సిందిగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా కోరింది.
'మేము ఏ-క్లాస్‌ను విడుదల చేసినప్పుడు, భారతదేశం ఇలాంటి కాంపాక్ట్ లగ్జరీ కార్లకు సిద్ధంగా ఉందా లేదా అనే సందేహం ఉండేది. అయితే, ఇటీవలి మా అనుభవాన్ని బట్టి చూస్తే, భారత్ సిద్ధంగా ఉందని మేము చెప్పగలము. ఈరోజు మెర్సిడెస్ బెంజ్ నుంచి భారత్‌లో అమ్ముడుపోతున్న ప్రతి నాలుగు కార్లలో ఒక కాంపాక్ట్ కారు ఉంద'ని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎబర్‌హార్డ్ కెర్న్ తెలిపారు.

మెర్సిడెస్ బెంజ్ తమ ఏ-క్లాస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన మొదటి 10 రోజుల్లోనే 400 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదలైన బి-క్లాస్ విషయంలోను ఇదే పరిస్థితి. కేవలం పెట్రోల్ వేరియంట్లే ఇప్పటి వరకూ 500 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. కంపెనీ ఇటీవలే ఇందులో డీజిల్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది.
ప్రస్తుతానికి ఈ రెండు మోడళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత్‌కు దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు. వీటిని స్థానికంగా అసెంబ్లింగ్ చేసే అంశంపై 2014లో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉండగా, మెర్సిడెస్ బెంజ్ తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన జిఎల్-క్లాస్ ఎస్‌యూవీని, స్థానికంగా పూనేలోని ఛాకన్ ప్లాంటులో అసెంబ్లింగ్ చేసి, ఆగస్ట్ 26, 2013న విడుదల చేయనున్నట్లు కూడా మెర్సిడెస్ బెంజ్ ప్రకటించిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








