నేడే మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ డీజిల్ విడుదల
లగ్జరీ కార్ ప్రియుల మరొక గుడ్ న్యూస్. జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన చిన్న కారు బి-క్లాస్‌లో తాజాగా డీజిల్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. నేడు (జులై 11, 2013) మెర్సిడెస్ బెంజ్ ఇండియా డీజిల్ వెర్షన్ బి-క్లాస్‌ను దేశీయ విపణిలో వాణిజ్య పరంగా విడుదల చేయనుంది.
భారత మార్కెట్లో తమ బి-క్లాస్ శ్రేణి మోడళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకొని మెర్సిడెస్ బెంజ్ ఈ మోడల్‌ను ప్రవేశపెట్టింది. అయితే, ప్రస్తుతం ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు. ఈ నేపథ్యంలో, బి-క్లాస్ అమ్మకాలను పెంచుకునేందుకు గాను మరియు ఈ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు గాను కంపెనీ ఇందులో డీజిల్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది.
డీజిల్ వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ లగ్జరీ కారులో 2.2 లీటర్, ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. కంపెనీ ఇటీవలే ప్రవేశపెట్టిన ఏ-క్లాస్ కారులో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. బేస్ వేరియంట్లో సన్‌రూఫ్ ఉండబోదని తెలుస్తోంది.
ఇంకా ఇందులో 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ స్థానంలో 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. పెట్రోల్ వెర్షన్ ధర కన్నా ఇది రూ.60,000 నుంచి రూ.80,000 తక్కువగా ఉండనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.



Click it and Unblock the Notifications








