సెప్టెంబర్ నుంచి పెరగనున్న మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని మోడళ్ల ధరలను వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. సెప్టెంబర్ 1, 2013వ తేది నుంచి తమ కార్ల ధరలను మోడల్‌ను బట్టి 2.5 శాతం నుంచి 4.5 శాతం మధ్యలో పెంచనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఎక్సేంజ్ రేట్ల ఒడిదుడుకులు, అధిక దిగుమతి సుంకాలు మరియు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులకు తోడుగా అధిక వడ్డీ రేట్లు వంటి పలు అంశాల వలన ధరలను పెంచాల్సి వస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎబర్‌హార్డ్ కెర్న్ తెలిపారు. డాలరు మారకంతో పోల్చుకుంటే రోజురోజుకీ క్షీణిస్తున్న రూపాయి విలువ కూడా ఇందుకు ప్రధాన కారణమని ఆయన అన్నారు.

ఉత్పత్తుల ధరలను పెంచినప్పటికీ, తమ వినియోగదారుల సౌకర్యార్థం ఫ్లెక్సినామిక్స్, స్టార్ అగిలిటీ, స్టార్ సూపర్‌సోనిక్ వంటి రుణ సదుపాయాలను మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా ఆఫర్ చేస్తున్నామని, ఈ సౌకర్యం వలన కస్టమర్లు తమకు నచ్చిన రుణ స్కీమ్‌ను ఎంచుకుని, తమ కలల కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
తాజా పెంపు తర్వాత మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న కొన్ని కార్ల ధరల క్రింది విధంగా ఉండనున్నాయి:
ఏ180 సిడిఐ - రూ.22.05 లక్షలు (4 శాత పెంపు)
బి180 సిడిఐ - రూ.23.50 లక్షలు (4 శాత పెంపు)
సి-క్లాస్ 200 సిజిఐ - రూ.32.25 లక్షలు (2.5 శాత పెంపు)
ఈ-క్లాస్ 200 సిజిఐ - రూ.42.16 లక్షలు (3.5 శాత పెంపు)
ఎమ్ఎల్-క్లాస్ 250 సిడిఐ - రూ.50.98 లక్షలు (4 శాత పెంపు)
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)


Click it and Unblock the Notifications








