నెక్స్ట్ జెన్ జిటి-ఆర్‌ను ఖరారు చేసిన నిస్సాన్; 2015లో రాక!
జపనీస్ సూపర్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ కార్పోరేషన్ సుమారు 5 ఏళ్ల క్రితం పరిచయం చేసిన నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కారు మార్కెట్లో అనూహ్య సక్సెస్‌ను సాధించి, ఖరీదైన కార్లు తయారు చేసే కంపెనీ గుండెల్లో గుబులు రేకెత్తించింది. నిస్సాన్ నుంచి సరసమైన ధరకే లభిస్తున్న ఈ స్పోర్ట్స్ కారు అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా అశేష అభిమానులను సొంతం చేసుకుంది.
చూడగానే ఆకట్టుకునే డిజైన్, అధునాత సాంకేతిక పరిజ్ఞానం, సాటిలేని పవర్, పెర్ఫామెన్స్‌లతో ఇది కార్ ప్రియుల మదిని దోచుకుంది. నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కార్ సక్సెస్‌కు గుర్తింపుగా ఈ మోడల్‌లో ఓ తర్వాతి తరం (నెక్స్ట్ జనరేషన్) మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. కొత్త మోడల్ రాకతో దీని లీడర్‌షిప్ స్థానం అలానే కొనసాగగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాలిఫోర్నియాలో జరిగిన నిస్సాన్ 360 గ్లోబల్ ప్రెస్ కార్యక్రమంలో, నిస్సాన్ ప్రతినిధులు ఈ వార్తను ఖరారు చేశారు. 2016లో సరికొత్త జిటి-ఆర్ స్పోర్ట్స్ కారును విడుదల చేస్తామని పేర్కొన్నారు. అయితే, ఈ కారుకు సంబంధించి అంతకు మించిన వివరాలను వారు వెల్లడించలేదు. దీన్నిబట్టి చూస్తుంటే 2015లో ఈ కొత్త జిటి-ఆర్ కారును ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిస్సాన్ నుంచి రానున్న ఈ సరికొత్త జిటి-ఆర్ స్పోర్ట్స్ కారు మరింత పవర్ ప్యాక్డ్ ఇంజన్‌తో మెురుగైన పెర్ఫామెన్స్‌తో రూపుదిద్దుకోనుంది. అయితే, ప్రస్తుతం దాదాపు అన్ని సూపర్ కార్, స్పోర్ట్స్ కార్ కంపెనీలు హైబ్రిడ్ హైపర్ కార్లపై దృష్టి సారించిన నేపథ్యంలో, నిస్సాన్ నుంచి జిటి-ఆర్ స్పోర్ట్స్ కారులో ఓ హైబ్రిడ్ వెర్షన్‌ను విడుదలయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








