2013-14లో లక్ష కార్లను విక్రయిస్తాం: నిస్సాన్ ఇండియా
భారత ఆటోమొబైల్ మార్కెట్లో వరుసగా సరికొత్త మోడళ్లను విడుదల చేస్తూ వస్తున్న జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా, ఈ ఏడాది వీలైనంత ఎక్కువ సంఖ్యలో కొనుగోలుదారులను తమ ఖాతాలో చేర్చుకోవాలని యోచిస్తోంది. ఇటీవల్ నిస్సాన్ మైక్రా, నిస్సాన్ మైక్రా యాక్టివ్ మోడళ్లను విడుదల చేసిన నిస్సాన్ ఇండియా, త్వరలోనే తమ సరికొత్త ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ 'నిస్సాన్ టెర్రానో'ను అలాగే రిఫ్రెష్డ్ 'నిస్సాన్ ఇవాలియా' ఎమ్‌పివిని విడుదల చేయనుంది.
ఈ కొత్త మోడళ్ల విడుదల ద్వారా ప్రస్తుతం సంవత్సరంలో మొత్తం లక్ష యూనిట్ల వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్ తమకు కీలకమైన మార్కెట్ అని, ఈ ఆర్థిక సంవత్సరం సుమారు లక్ష యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిస్సాన్ మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అజయ్ రఘువంశీ తెలిపారు.

కాగా గడచిన ఆర్థిక సంవత్సరంలో (2012-13లో) నిస్సాన్ ఇండియా 37,000 వాహనాలను విక్రయించగా, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో (2011-12లో) 37,000 యూనిట్లు విక్రయించిందని ఆయన వివరించారు. నిస్సాన్ ఇటీవలే మైక్రా యాక్టివ్ పేరుతో ఓ చవక వేరియంట్‌ను కేవలం రూ.3.50 లక్షల ప్రారంభ ధరకే విడుదల చేయగా, కొత్త 2013 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మైక్రాను రూ.4.71 లక్షల ప్రారంభ ధరకు విడుదల చేసింది.
నిస్సాన్ మైక్రాను గడచిన 2010లో మార్కెట్లో విడుదల చేశామని, అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 43,000 యూనిట్లకు పైగా విక్రయించామని రఘవంశీ చెప్పారు. మార్కెట్లో కొత్త మోడళ్లను విడుదల చేయటం ద్వారా అదనంగా 35 నుంచి 50 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంటామని, త్వరలోనే డీలర్‌షిప్ నెట్‌వర్కును కూడా విస్తరిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు ఈనెల 16న నిస్సాన్ తమ పురాతన బ్రాండ్ డాట్సన్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేస్తున్న సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








