ఫాస్టెస్ట్ యాక్సిలరేటింగ్ ప్రొడక్షన్ కారుగా నిస్సాన్ జిటి-ఆర్ నిస్మో
జర్మన్ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్‌కు పెర్ఫామెన్స్ డివిజన్ 'ఏఎమ్‌జి' ఎలాగో, జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్‌కు 'నిస్మో' అలాగ. నిస్సాన్ అందిస్తున్న కార్లను మోడిఫై చేసి పెర్ఫామెన్స్ కార్లుగా తీర్చిదిద్ది నిస్సాన్ నిస్మో బ్రాండ్ క్రింద విక్రయిస్తుంటారు. తాజాగా, నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కారులో కంపెనీ ఓ పెర్ఫామెన్స్ ఎడిషన్‌ను అభివృద్ది చేసింది. ఈ నిస్సాన్ జిటి-ఆర్ నిస్మో ఫాస్టెట్స్ యాక్సిలరేషన్ ప్రొడక్షన్ కారుగా రికార్డు సాధించింది.
కార్ మ్యాగజైన్ ఆటో ఎక్స్‌ప్రెస్ పేర్కొన్న సమాచారం ప్రకారం, నిస్సాన్ జిటి-ఆర్ నిస్మో కేవలం 2 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకు ఫాస్టెస్ట్ యాక్సిలరేషన్ కారుగా నిలిచింది. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయటంలో విలియమ్స్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ (డబ్ల్యూఏఈ) నిస్సాన్‌కు ఎంతగానో సహకరించింది.

ట్విన్ టర్బో వి6 ఇంజన్, సిక్స్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్ కలిగిన రెగ్యులర్ వెర్షన్ నిస్సాన్ జిటి-ఆర్ 2.7 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అయితే, జిటి-ఆర్ నిస్మో కేవలం 2 సెకండ్ల వ్యవధిలోనే ఈ వేగాన్ని చేరుకుంటుంది. అంటే, దీని పవర్ టూ వెయిట్ రేషియో ఎంత సమర్థవంతమైనదో ఇట్టే అర్థమైపోతుంది.
ఇంజన్ పవర్‌ను పెంచి, బాడీ వెయిట్‌ను తగ్గించడం వల్ల ఇది సాధ్యమైంది. అంతేకాకుండా, మరింత ఎక్కువ గ్రిప్ కలిగిన టైర్లను, గేర్ షిఫ్ట్ టైమ్‌ను మరింత వేగవంతం చేయటం కూడా ఈ యాక్సిలరేషన్ స్థాయిని పెంచడంలో కీలకం అని చెప్పవచ్చు.

నిస్సాన్ జిటి-ఆర్ నిస్మో పూర్తిస్థాయిలో ఉత్పత్తి దశకి చేరుకుంటే, ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే మరియు ఫాస్టెస్ట్ యాక్సిలరేటింగ్ ప్రొడక్షన్ కారుగా ప్రస్తుతం బరిలో ఉన్న 1200 హార్స్ పవర్ బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్ కారును ఓవర్‌టేక్ చేసి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవటం ఖాయం. బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్ కేవలం 2.5 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
కొత్త 2015 నిస్సాన్ జిటి-ఆర్ నిస్మో పెర్ఫామెన్స్ కారును ఈ ఏడాది జపాన్‌లో జరిగనున్న 2013 టోక్యో మోటార్ షోలో ఆవిష్కరించనున్నారు.


Click it and Unblock the Notifications








