మైక్రా, సన్నీ కార్ల ధరలను పెంచిన నిస్సాన్ ఇండియా
పండుగ సీజన్‌లో కొనుగోలుదారులకు నిస్సాన్ ఇండియా షాక్ ఇచ్చింది. ఓవైపు కొన్ని కార్ల కంపెనీలు తమ ఉత్పత్తుల డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంటే, నిస్సాన్ ఇండియా మాత్రం ధరలను పెంచి, కొనుగోలుదారులపై అధనపు భారాన్ని మోపింది. రూపాయి విలువ ప్రభావం, పెరుగుతున్న ఉత్పాదక వ్యయాలను తగ్గించుకునేందుకు, కొన్ని ఎంపిక చేసిన కార్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది.
నిస్సాన్ ఇండియా అందిస్తున్న సన్నీ సెడాన్, మైక్రా మరియు మైక్రా యాక్టివ్ హ్యాచ్‌బ్యాక్ కార్ల ధరలను 1.4 శాతం నుంచి 2.9 శాతం మేర పెంచుతున్నామని, ఈ పెంపు తక్షణమే (అక్టోబర్ 1, 2013వ తేది నుంచి) అమల్లోకి వస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. రూపాయి క్షీణత ప్రభావం, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు మరియు ద్రవ్యోల్బణం వలన పెరుగుతున్న ముడిసరుకుల ధరల నేపథ్యంలో ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వచ్చిందని హోవర్ ఆటోమోటివ్ ఇండియా (భారత్‌లోని నిస్సాన్ జాతీయ సేల్స్ కంపెనీ) డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) నితీష్ టిప్నిస్ తెలిపారు.

ఇదిలా ఉండగా, ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఉత్పత్తులను అక్టోబర్ 1, 2013 నుంచి మోడల్‌ను బట్టి రూ.6,000 నుంచి 20,000 మేర పెంచగా, మారుతి సుజుకి రూ.10,000 మేర, హ్యుందాయ్ మరియు జనరల్ మోటార్స్ కంపెనీలు రూ.20,000 మేర ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications























