వాస్తవ రూపం దాల్చనున్న నిస్సాన్ డ్రైవర్‌లెస్ కార్లు
అమెరికాలో ప్రతి ఏటా దాదాపు 60 లక్షల మోటార్ వాహన ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఫలితంగా 160 బిలియన్ డాలర్ల నష్టం వాటిళ్లుతోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 4 నుమచి 34 ఏళ్ల వయస్సు కలిగిన ప్రజల మరణాలకు ప్రధాన కారణాల్లో రోడ్ యాక్సిడెంట్ కూడా ఒకటి. 93 శాతం రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని ఓ నివేదిక తెలుపుతోంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు కార్ల కంపెనీలు కొత్త ప్లాన్‌తో ముందుకు వస్తున్నాయి. అవే డ్రైవర్‌లెస్ కార్లు.
ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు డ్రైవర్ అవసరం లేని ఆటోమేటిక్ కార్లను (అటానమస్ కార్లు) అభివృద్ది చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా, జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ కార్పేషన్ అభివృద్ధి చేస్తున్న అటానమస్ కారు కూడా త్వరలోనే వాస్తవ రూపం దాల్చనుంది. 2020 నాటికి ఈ ఆటోమేటిక్ కార్లు డ్రైవర్ సాయం లేకుండా రోడ్లపై పరుగులు తీయనున్నాయి.

నిస్సాన్ తమ తర్వాతి రెండు తరాల వాహనాల్లో ఆటానమస్ డ్రైవ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చి, డ్రైవర్ అవసరం లేని కార్లను తమ కొనుగోలుదారులకు ఆఫర్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఈ టెక్నాలజీపై పనిచేస్తున్న నిస్సాన్, కొన్ని కార్లలో ఈ టెక్నాలజీ అమర్చి, రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది. రోడ్డుపై అన్ని వాతావరణాలు, అన్ని పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా ఈ కార్లను నిస్సాన్ అభివృద్ధి చేస్తోంది.
ఇందు కోసం కంపెనీ 'సేఫ్ షీల్డ్' అనే టెక్నాలజీని రూపొందించింది. రిస్కులను గుర్తించేందుకు డ్రైవర్‌లెస్ కార్లకు ఓ 360 డిగ్రీ వ్యూ కలిగిన కెమెరాను, లేజర్ సెన్సార్లను అమర్చుతారు. జిపిఎస్ శాటిలైట్ నావిగేషన్ సాయంతో ప్రయాణికుల చేరాల్సిన గమ్యాన్ని కారులో ఉండే కంప్యూటర్‌పై ఎంచుకుంటే చాలు ఇవి ఆటోమేటిక్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి, కారులోని ప్యాసింజర్లను సురక్షితంగా గమ్యాలకు చేరవేస్తాయి. ఈ అటానమస్ కార్ల సాయంతో రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చని నిస్సాన్ భావిస్తోంది.



Click it and Unblock the Notifications








