నిస్సాన్ టెర్రానో ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ డస్టర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా ఓ ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్నట్లు, దాని పేరును టెర్రానోగా నిర్ణయించినట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే.
కాగా, ఈ ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ 'నిస్సాన్ టెర్రానో' (Nissan Terrano) ధర రూ.8.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఇది వచ్చే అక్టోబర్ నెల నాటికి మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఫీచర్ల విషయంలో ఇది రెనో డస్టర్ కన్నా మెరుగ్గా ఉండనుంది. అందుకే దీని ధర కూడా డస్టర్ కన్నా అధికంగా ఉండనుంది.

నిస్సాన్ ఇండియా ఇటీవలే తమ టెర్రానో ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన ఓ అఫీషియల్ డిజైనర్ స్కెచ్‌ను కూడా విడుదల చేసింది. ఇది కేవలం డీజిల్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానున్నట్లు సమాచారం. ఇందులో పెట్రోల్ వేరియంట్ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. టెర్రాన్ కోసం నిస్సాన్ 'మీరు ఎంత ధృఢమే ఇది కూడా అంత ధృఢం' (As solid as you) అనే ట్యాగ్‌లైన్‌ను ఉపయోగించనుంది.
నిస్సాన్ టెర్రానో మొత్తం నాలుగు వేరియంట్లలో (ఎక్స్ఎల్, ఎక్స్ఎల్ ఆప్షనల్, ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం) లభ్యం కానుంది. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసినదాని ప్రకారం, ఇది లీటరుకు 20.5 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేయనుంది. రెనో డస్టర్ బేస్ డీజిల్ వేరియంట్ (ఆర్ఎక్స్ఈ) ధర రూ.8.73 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అంటే, ఇది నిస్సాన్ టెర్రానో ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ కన్నా కేవలం రూ.17,000 మాత్రమే తక్కువ ధరను కలిగి ఉంది. తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








