రూపాయి ఎఫెక్ట్: భారీగా పెరగనున్న డీజిల్ ధర!
రోజురోజుకీ క్షీణిస్తున్న రూపాయి విలువ సామాన్యుడికి సైతం వణుకు పుట్టిస్తోంది. క్షీణిస్తున్న రూపాయి విలువ అనేక రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతోంది. డాలరుతో పోల్చుకుంటే రూ.66 దాటిన రూపాయి విలువ డీజిల్ ఇంధనంపై ప్రభావం చూపుతోంది. రూపాయి క్షీణతతో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు, డీజిల్ ధరను ఏక మొత్తంలో పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ గణనీయంగా క్షీణిస్తున్న నేపథ్యంలో డీజిల్ విక్రయంపై నష్టాల భారం అధికమవుతోందని, దీనిని తగ్గించుకునేందుకు తమకు అవకాశం ఇవ్వాలని చమురు కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. గడచిన ఏప్రిల్ నుంచి రూపాయి విలువ 12 శాతం మేర తరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో చమురు దిగుమతుల కోసం అధిక మొత్తం చెల్లించాల్సి వస్తోందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.

చమురు కంపెనీలు ఈ ఏడాది జనవరి నుంచి ప్రతినెలా డీజిల్ ధరను 50 పైసల వరకు పెంచుతూ వస్తున్న సంగతి తెలిసినదే. దీని వలన మే 2013 నాటికి లీటరు డీజిల్ విక్రయంపై నష్టం రూ.3 తగ్గిపోయింది. అయితే, రూపాయి విలువ మళ్లీ క్షీణించడంతో ఈ నష్టం గరిష్టంగా పెరిగింది. ప్రస్తుతం లీటర్ డీజిలు విక్రయంపై రూ.10.22 నష్టం వాటిళ్లుతోందని ఐఓసి డైరెక్టర్ (ఫైనాన్స్) పికె గోయల్ తెలిపారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన ధరలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని తాము ప్రభుత్వాన్ని కోరామని, దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన వివరించారు. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రకటిస్తే, డీజిల్ ధరలు మరోసారి ఏకంగా లీటరుపై గరిష్టంగా 5 రూపాయల మేర పెరిగే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








