ఆగస్ట్ నెలలో జోరు తగ్గిన డస్టర్; కంపెనీ అమ్మకాలు డౌన్
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కొత్త మోడళ్ల రాకతో ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా అందిస్తున్న డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ జోరు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. గడచిన ఆగస్ట్ నెలలో రెనో ఇండియా మొత్తం అమ్మకాలు అంతకు ముందు సంవత్సరం ఆగస్ట్ నెలతో పోల్చుకుంటే (అప్పటి ఇంకా డస్టర్ విడుదల కాలేదు) 4.6 శాతం క్షీణించి 3,916 యూనిట్ల నుంచి 3,733 యూనిట్లకు పడిపోయాయి.
స్థూల ఆర్థిక కారణాలైన ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధిక ఇంధన ధరలు, అస్థిరమైన స్టాక్ మార్కెట్, నానాటికీ క్షీణిస్తున్న రూపాయి మారకపు విలువ తదితర అంశాలు భారత ఆటోమొబైల్ పరిశ్రకు పెను సవాళ్లుగా మారాయాని, ఫలితంగా వినియోగ డిమాండ్ తగ్గి, అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయని రెనో ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) సుమిత్ సాహ్నే తెలిపారు.

అయితే, ఈ ఏడాది ఆరంభం నుంచి ఆటోమొబైల్ మార్కెట్ సవాళ్లతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కుంటున్నప్పటికీ, తాము మాత్రం జనవరి-ఆగస్ట్ 2013 మధ్య కాలంలో మొత్తం 45,986 యూనిట్ల వాహనాలను విక్రయించగలిగామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్ట్ 2013లో మొత్తం 3,733 వాహనాలను విక్రయించగా అందులో 2,967 యూనిట్లు డస్టర్ ఎస్‌యూవీలే ఉన్నాయి.
మిగిలిన వాటిలో 340 స్కాలా సెడాన్లు, 404 పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లు, 11 ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్లు, 10 కొలియోస్ ప్రీమియం ఎస్‌యూవీలు ఉన్నాయని కంపెనీ వివరించింది. ఏదేమైనప్పటికీ, పాపులర్ డస్టర్ రాకతో కంపెనీ అమ్మకాలు బాగానే జోరందుకున్నాయి. అయితే, ఈ సెగ్మెంట్లో లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆకర్షనీయమైన ధరతో, డస్టర్‌ను కొనాలనున్న వారిని సైతం తన వైపుకు ఆకట్టుకుంటుంది.


Click it and Unblock the Notifications








