భారత మార్కెట్ కోసం రెనో నుంచి ఓ చవక కారు
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, దేశీయ విపణిలో ఓ చవక కారును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. భారత మార్కెట్లో రూ.4 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన కారును ప్రవేశపెట్టడంపై దృష్టి సారిస్తున్నట్లు రెనో చైర్మన్ (ఆసియా పసిఫిక్ రీజియన్) గిలెస్ నార్మండ్ వెల్లడించారు. భారత్‌లో అమ్ముడయ్యే కార్లలో ఈ శ్రేణి కార్ల వాటా 40 శాతం పైగానే ఉంటోందని ఆయన తెలిపారు.
అంతేకాకుండా, భారత ఆటోమొబైల్ మార్కెట్లో వేగంగా వృద్ధి చెందుతున్న మల్టీ యుటిలిటీ వెహికల్ (ఎమ్‌యూవీ) సెగ్మెంట్లో కూడా ఓ కొత్త ఉత్పత్తిని (బహుశా ప్రస్తుతం రెనో గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న లాడ్జీ ఎమ్‌పివిని) ప్రవేశపెడతామని గిలెస్ వివరించారు.

ప్రస్తుతం రెనో ఇండియా భారత మార్కెట్లో మొత్తం ఐదు మోడళ్లను (పల్స్, స్కాలా, ఫ్లూయెన్స్, డస్టర్, కొలియోస్) విక్రయిస్తోంది. కాగా.. భారత మార్కెట్లో ఈ ఏడాది అమ్మకాల్లో 90 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నామని, గతేడాది 35,000 వాహనాలు విక్రయించగా, ఈసారి సుమారు 65,000-66,000 యూనిట్ల మేర వాహనాలను విక్రయించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రెనో ఇండియా ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) డస్టర్ అమ్మకాలు తగ్గుతుండటంపై గిలెస్ మాట్లాడుతూ.. ఏదైనా కొత్త మోడల్ ప్రవేశపెట్టినప్పుడు ప్రారంభంలో స్పందన భారీగా ఉండి తర్వాత ఒక స్థాయిలో స్థిరపడుతుందని, డస్టర్ విషయంలోనూ ప్రస్తుతం ఇదే జరుగుతోందని చెప్పారు. ఏదేమైనప్పటికీ, ఈ మోడల్ అమ్మకాలను వచ్చే ఏడాది డస్టర్‌లో సరికొత్త వేరియంట్స్‌ని (బహుశా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని) ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








