భారత్ కోసం స్పెషల్ రోల్స్ రాయిస్, సింబల్ కోసం అన్వేషణ
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఓ స్పెషల్ కారును తయారు చేయనుంది. భారతదేశం యొక్క 'స్ఫూర్తి మరియు సాంస్కృతిక వైవిధ్యాల'ను ప్రతిభింభింపజేసేలా ఓ ఎక్స్‌క్లూజివ్ మోడల్‌ను తయారు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు భారతీయ చిహ్నం (Indian Symbol)ను ఉపయోగించుకునేందుకు రోల్స్ రాయిస్ సంబంధిత అధికారులను అనుమతి కోరుతోంది.
గతంలో రోల్స్ రాయిస్ చైనా దేశం కోసం ఇలాంటిదే ఓ ఎక్స్‌క్లూజివ్ మోడల్‌ను తయారు చేసింది. ఆ కారుపై వారి సాంప్రదాయ చిహ్నం డ్రాగన్‌ను ఉపయోగించింది. 'ఇయర్ ఆఫ్ ది డ్రాగన్ ఫాంటన్' అనే పేరుతో రోల్స్ రాయిస్ ఈ కారును ప్రత్యేకమైన కలర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్లతో డిజైన్ చేసింది. ఈ నేపథ్యంలో, ఇండియా కోసం రూపొందించనున్న కారు కూడా ఫాంటమ్ మోడల్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేసే ఆస్కారం ఉంది.

అయితే, చైనా వెర్షన్ కారుపై డ్రాగన్ సింబల్‌ను ఉపయోగించగా, ఇండియన్ వెర్షన్ కారుపై ఏ సింబల్ ఉపయోగిస్తారనే దానిపైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ ఈ స్పెషల్ ఎడిషన్ కారు భారత మార్కెట్లో విడుదలయ్యే ఆస్కారం ఉంది.
భారతదేశపు స్ఫూర్తి, సాంస్కృతిక వైవిధ్యాలను ప్రతిభింభిపజేసే చిహ్నం కోసం చూస్తున్నామని, ఇది (భారతదేశం) ఓ అందమైన దేశమని, ఈ దేశంలోని ప్రతి ప్రాంతం కూడా తమ స్వంత సంస్కృతి, సాంప్రదాయాలను కలిగి ఉంటుందని, కాబట్టి అందకు తగినట్లుగా ఉండే సింబల్‌ను ఎంచుకోవాలని రోల్స్ రాయిస్ జనరల్ మేనేజర్ (ఎమర్జింగ్ మార్కెట్స్, ఏషియా) తెలిపారు.



Click it and Unblock the Notifications








