స్కొడా ర్యాపిడ్ సెడాన్ కోసం ఈఎమ్ఐ హాలిడే ఆఫర్
చెక్-రిపబ్లిక్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ర్యాపిడ్ సెడాన్ కోసం ఓ సరికొత్త ఈఎమ్ఐ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. 'ఈఎమ్ఐ హాలిడే ఆఫర్' పేరిట ఓ పరిమిత కాల (లిమిటెడ్ పీరియడ్) స్కీమ్‌ను కంపెనీ అందిస్తోంది. ఇందులో భాగంగా, స్కొడా ర్యాపిడ్ కొనుగోలుదారులు వచ్చే ఏడాది వరకూ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే స్కొడా ర్యాపిడ్ సెడాన్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది.
అంటే, ఫైనాన్స్ సదుపాయం ద్వారా స్కొడా ర్యాపిడ్‌ను కొనుగోలు చేసేవారు మొదటి సంవత్సరం పూర్తిగా ఈఎమ్‌ఐలను చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. కారు కొనుగోలు చేసిన తర్వాత రెండవ సవంత్సరం ప్రారంభం నుండి, వినియోగదారులు విశిష్టమైన ఈఎమ్‌ఐ ఆప్షన్లను ఎంచుకొని, సదరు ఈఎమ్ఐలను చెల్లించాల్సి ఉంటుంది. స్కొడాకు చెందిన ఆర్థిక సేనల విభాగం స్కొడా ఫైనాన్స్ ఈ పరిమిత కాలపు ఈఎమ్ఐ హాలిడే ఆఫర్‌ను అందిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్‌లను దృష్టిలో ఉంచుకొని, తమ వినియోగదారుల కోసం ఈ విశిష్టమైన స్కీమ్‌ను ప్రారంభించామని, ఈ ఆఫర్ ద్వారా కొనుగోలుదారులు సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్లతో స్కొడా ర్యాపిడ్ కారును సొంతం చేసుకోవచ్చని స్కొడా ఆటో ఇండియా మార్కెటింగ్ హెడ్ కమల్ బసు తెలిపారు. ఈ స్కీమ్‌కు సంబంధించిన నియమ నిబంధనలు మరియు మరింత సమాచారం కోసం మీ సమీపంలోని అధీకృత స్కొడా డీలర్‌ను సంప్రదించండి.

తగ్గుముఖం పడుతున్న అమ్మకాలను పెంచుకునేందుకు స్కొడా వివిధ స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. స్కొడా ఇండియా ఇటీవలే తమ ర్యాపిడ్ సెడాన్ 8,999 ఈఎమ్ఐ స్కీమ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, గుజరాత్‌లోని ఓ స్కొడా డీలర్ ప్రస్తుత సంవత్సరంలో ర్యాపిడ్ సెడాన్‌ను కొనుగోలు చేస్తే ఐదేళ్ల తర్వాత ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌ను ఉచితంగా ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసినదే.
ఇక స్కొడా ర్యాపిడ్ సెడాన్ విషయానికి వస్తే, ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6 లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 104 బిహెచ్‌పిల శక్తిని, 153 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6-లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ 104 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.


Click it and Unblock the Notifications








