బెంగుళూరు రోడ్లపై పరుగులు పెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులు
ప్రజా రవాణా వ్యవస్థలో కర్ణాటక రాజధాని బెంగుళూరు అన్ని రాష్ట్రాల కన్నా ఓ అడుగు ముందే ఉందని చెప్పాలి. ఇప్పటికే నగరంలో టాటా, వోల్వో సిటీ బస్సులను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ (బిఎమ్‌టిసి), తాజాగా పూర్తి పర్యావరణ సాన్నిహిత్యమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది.
బిఎమ్‌టిసి ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను నగర రోడ్లపై ప్రయోగాత్మకంగా నడిపేందుకు రంగం సిద్ధం చేసింది. నగర రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సుల పెర్ఫామెన్స్, పనితీరును పరిశీలించేందుకు వీటిని ప్రధానంగా రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై టెస్ట్ రన్ నిర్వహించనున్నారు. బిఎమ్‌టిసి ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను మెజిస్టిక్ బస్ టెర్మినస్‌కు తీసుకువచ్చింది, ఈ విషయంలో రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ క్లియరెన్స్ కోసం బిఎమ్‌టిసి వేచి చూస్తోంది.
ఈ ప్రయోగం సక్సెస్ అయితే, మరికొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపై తిప్పే అవకాశం ఉంటుంది. మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఎలక్ట్రిక్ బస్సు ప్రయోగం గురించి బిఎమ్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ అంజుమ్ పర్వేజ్ మాట్లాడుతూ.. మూడు నెలల పాటు బిఎమ్‌టిసి మరియు చైనీస్ కంపెనీలు సంయుక్తంగా ఈ ట్రైల్ రన్‌ను నిర్వహిస్తాయని తెలిపారు.

ఈ ఎలక్ట్రిక్ బస్సు వోల్వో సిటీ బస్సు మాదిరిగానే ఉంటుంది. ఇందులో 41 మంది ప్రయాణికులు కూర్చునేందుకు వీలుంటుందని తెలిపారు. వీటి వల్ల కలిగే పెద్ద ప్రయోజనం ఏంటంటే, ఇవి పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనవి కావటేమనని ఆయన తెలిపారు.

ఈ ఎలక్ట్రిక్ బస్సుల వలన ధ్వని కాలుష్యం, వాయి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం వంటి ఉండవని, రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్టీఓ) నుంచి క్లియరెన్స్ లభించగానే, ఈ బస్సులను లాంఛనంగా ప్రారంభిస్తామని పర్వేజ్ చెప్పారు.

సాధారణంగా కాలుష్యాన్ని వెదజల్లే, శబ్ధంతో కూడిన డీజిల్ ఇంజన్లతో పోల్చుకుంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులు నిశ్శబ్ధంగా ఉండి, ఎలాంటి ప్రమాదకర వాయువులను విడుదల చేయవని బిఎమ్‌టిసి అధికారి ఒకరు వెల్లడించారు.

ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఆరు నుంచి ఏడు గంటల పాటు చార్జ్ చేస్తే సుమారు 240 నుంచి 260 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని పర్వేజ్ వివరించారు.

ఇప్పటికే అమెరికా, కెనడా, చైనా, జపాన్, సింగపూర్‌లతో పాటు అనేక యూరోపియన్ దేశాల్లో ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

భారతదేశంలో ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కడా లేవు. ఒకవేళ బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ వీటిని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువస్తే, భారతదేశంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మొట్టమొదటి నగరంగా బెంగుళూరు చరిత్ర సృష్టించనుంది.

అయితే, ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించడం అంత సులువైన పనేం కాదు. ఈ బస్సుల డీజిల్, మెయింటినెస్స్ ఖర్చుల బాధ లేకపోయినప్పటికీ, వీటి ధరే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. సాధారణ డీజిల్ బస్సులతో పోల్చుకుంటే ఈ ఎలక్ట్రిక్ బస్సుల ధర రెండింతలు ఉంటుంది.


Click it and Unblock the Notifications








