ఎల్‌పిజి, సిఎన్‌జి కిట్లపై వారంటీ ఆఫర్ చేయాల్సిందే!
త్వరలోనే ఎల్‌పిజి, సిఎన్‌జి కిట్లపై వాటి తయారీదారులు వారంటీ లేదా గ్యారంటీని ఆఫర్ చేసే ఆస్కారం ఉంది. ఈ విషయంపై ఇటీవల రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంతో, ఎల్‌పిజి, సిఎన్‌జి కిట్లను తయారు చేసే సంస్థలు వాటిపై వారంటీ లేదా గ్యారంటీని ఆఫర్ చేయటం తప్పనిసరి కానుంది. మరో 3-4 నెలల్లో ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది.
ఈ తాజా నిర్ణయంతో ఎల్‌పిజి, సిఎన్‌జి కిట్ల తయారీల నాణ్యత పెరగటమే కాకుండా, వీటిని ఉపయోగించే వారికి కూడా సురక్షితమైన అనుభూతిని కలిగిస్తాయి. వీటి నాణ్యత పెరగటం వలన సదరు ఇంధనాలను ఉపయోగించుకొని నడిచే వాహనాల్లో ప్రమాదాలు కూడా తగ్గే ఆస్కారం ఉంది. అంతేకాకుండా, అనధికారికంగా సిఎన్‌జి/ఎల్‌పిజి కిట్లను తయారు చేసే వారికి కూడా ఇది చెక్ పెట్టినట్లు అవుతుంది.

ఇప్పటి వరకూ భారతదేశంలో ఏ ఎల్‌పిజి/సిఎన్‌జి కిట్లను తయారు చేసే సంస్థ కూడా వాటిపై ఎలాంటి గ్యారంటీలను ఆఫర్ చేయటం లేదు. వీటిని థర్డ్ పార్టీ ఫిట్టింగ్స్ మాత్రమే పరిగణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై వీటి తయారీదారుల మోసాలకు చెక్ పడనుంది. ఇకపై ఎలాంటి వారంటీ లేకుండా సిఎన్‌జి/ఎల్‌పిజి కిట్లను వారు విక్రయించకూడదు.
ఈ నిర్ణయంతో, సిఎన్‌జి, ఎల్‌పిజి ఇంధనాలతో నడిచే వాహనాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగి వీటి వినియోగం కూడా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా పర్యవరణానికి కాస్తైనా మేలు చేకూరుతుంది. వాస్తవానికి ఈ ఇంధనాలతో నడిచే వాహనాలు సాంప్రదాయ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్‌తో పోల్చుకుంటే ఎక్కువ మైలేజీనిస్తాయి.


Click it and Unblock the Notifications








