వేలంలో రూ.13 లక్షల వెల పలికిన ఆర్ట్ టాటా నానో

ఇది చూడటానికి మామూలు టాటా కారులానే ఉంటుంది. అయితే, దీని ఎక్స్టీరియర్ పెయింట్ మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇది భారతదేశపు తొలి ఆర్ట్ కారు. కొచ్చి బెయిన్నేల్ ఫౌండేషన్ (కేబీఎఫ్) ప్రెసిడెంట్, స్వతహాగా కళాకారుడు అయిన బోస్ కృష్ణమాచారి ఓ తెల్లటి నానో కారుపై, ఆటోమోటివ్ పెయింట్‌లను ఉపయోగించి, పూర్తిగా చేతుల్తో ఈ కారును పెయింట్ చేశారు.
అంతేకాదు, ఈ కారుపై మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ సంతకం కూడా ఉంటుంది. ఆయనే స్వయంగా ఈ సంతకం చేశారు. అందుకే ఈ కారు చాలా విశిష్టమైనది. మిగతా ఇంటీరియర్, ఇంజన్ ఫీచర్లన్నీ సాధారణ నానో కారు మాదిరిగానే ఉంటాయి. కేబీఎఫ్ ఈ కారును ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచింది. 24 గంటలపాటు సాగిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో ఈ కారు రూ.13,01,402 (22,438 డాలర్లు) వెల పలికింది.
అయితే, ఈ కారును వేలంలో ఎవరు గెలుచుకున్న విషయాన్ని కృష్ణమాచారి వెల్లడించలేదు. అయితే మంచి అభిరుచి ఉన్న వ్యక్తే ఈ కారును సొంతం చేసుకున్నారని ఆయన తెలిపారు. వేలం ద్వారా ఈ కారుకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము రావడం పట్ల కృష్ణమాచారి సంతోషం వ్యక్తం చేశారు. వేలం ద్వారా వచ్చిన ఈ సొమ్మును తమ సంస్థ ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications








