అక్టోబర్ నెలలో టాటా నానో సిఎన్‌జి వేరియంట్ విడుదల!
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే తమ హారిజోనెక్స్ట్ 2013 (Horizonext 2013) ప్రణాళికలో భాగంగా, కంపెనీ ఆవిష్కరించిన నానో సిఎన్‌జి వేరియంట్ 'టాటా నానో ఈమ్యాక్స్' అతి త్వరలోనే మార్కెట్లోకి రానుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుత పండుగ సీజన్‌ను పురస్కరించుకొని టాటా మోటార్స్ తమ నానో సిఎన్‌జిని విపణిలో వాణిజ్య పరంగా విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
టాటా హారిజోనెక్స్ట్ 2013 ప్రణాళికలో భాగంగా, కంపెనీ ఆవిష్కరించిన కొత్త 2013 టాటా నానో ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, సిఎన్‌జి వెర్షన్ మాత్రం అక్టోబర్ నెలలో విడుదల కానుంది. కొత్త 2013 నానోలో బ్లాక్ కలర్ ఇంటీరియర్స్ ఉండగా, సిఎన్‌జి నానోలో బీజ్ కలర్ ఇంటీరియర్స్‌ను ఉపయోగించారు. నానో సిఎన్‌జి వేరియంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

టాటా సిఎన్‌జి వేరియంట్లో 32 లీటర్ల ఇంధనం పట్టే ట్యాంక్‌ను అమర్చారు. ఇది కిలోకు 36 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

నానో సిఎన్‌జిలో కొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు ఇది సిఎన్‌జి వెర్షన్ అని తెలియజేసేందుకు కారు వెనుక వైపు ఈమ్యాక్స్ అనే బ్యాడ్జ్ ఉంటుంది.

ఇంటీరియర్స్‌లో స్పీడోమీటర్ చుట్టూ గ్రీన్ కలర్ రింగ్, సిఎన్‌జి ఫ్యూయెల్ సప్లయ్ కోసం ఆన్/ఆఫ్ స్విచ్ ఉంటాయి.

టాటా నానో సిఎన్‌జి కిలోమీటరుకు కేవలం 75 గ్రాముల కర్భన ఉద్ఘారాలను మాత్రమే విడుదల చేస్తుందని, ఇది భారత్‌లో కెల్లా అతి శుభ్రమైన (కాలుష్య నిబంధనల పరంగా) కారు అని కంపెనీ పేర్కొంది. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








