స్మార్ట్ ఫీచర్లతో 'స్మార్ట్ సిటీ కారు'గా మారనున్న చీప్ కారు
ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారుగా ముద్ర వేసుకున్న టాటా నానో, ఇప్పుడు ఆ పేరు మాపుకునేందుకు చర్యలు చేపట్టింది. గడచిన కొద్ది నెలలుగా టాటా నానో అమ్మకాలు గణనీయంగా తగ్గడంతో, టాటా మోటార్స్ కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే, 'పీపుల్స్ కారు'ను 'స్మార్ట్ సిటీ కారు'గా మార్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.
పేరుకు తగినట్లుగానే నానో కారులో మరిన్ని స్మార్ట్ ఫీచర్లను జోడించనున్నారు. ఇందులో ప్రధానంగా, కొత్త నానో కారులో పవర్ స్టీరింగ్‌తో పాటు మరికొన్ని అధనపు ఇంటెలిజెంట్ ఫీచర్లను జోడించి విక్రయించనున్నారు. అంతేకాకుండా, ఇంటీరియర్లు, ఎక్స్టీరియర్లు మరియు మైలేజ్ అంశాలను మెరుగుపరచనున్నట్లు టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ చెప్పారు.

ఫీచర్లు పెంచడంపై తాము దృష్టి సారించామని, ప్రతీ మోడల్ విడుదల ద్వారా నానోకు విలువను జోడించనున్నామని బుధవారం ముంబైలో జరిగిన 68వ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులకు మిస్త్రీ తెలిపారు. ఇప్పటికే జాప్యమైన టాటా నానో సిఎన్‌జి వేరియంట్‌ను కూడా ఈ ఏడాదే మార్కెట్లో విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
టాటా నానో కారుపై డిస్కౌంట్లు, వివిధ ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నప్పటికీ, ఈ మోడల్ అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఫలితంగా గుజరాత్‌లోని సనంద్‌లో ఉన్న టాటా నానో ప్లాంటులో ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సగానికి పైగా తగ్గించారు. ఈ నేపథ్యంలో, నానోను అప్‌గ్రేడ్ చేసి ప్రీమియం ఫీచర్లతో విడుదల చేయటం ద్వారా ఈ మోడల్ అమ్మకాలు పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది.

సియామ్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గడచిన మార్చ్ నెలలో ప్యాసింజర్ కార్ విభాగంలో టాటా మోటార్స్‌కు 11.8 శాతం మార్కెట్ వాటా ఉండగా, అది గడచిన జులై నెలలో 8.9 శాతానికి పడిపోయింది. మరి కొత్త నానో రాకతో టాటా మోటార్స్ దశ తిరుగుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








