డీజిల్ ట్యాంక్ పేలే అవకాశం లేదు: వోల్వో ఇంజనీర్లు
గడచిన మంగళవారం బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ వోల్వో బస్సు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం వద్ద తెల్లవారు జామున రోడ్డు ప్రమాదానికి గురై, బస్సులో మంటలు చెలరేగటంతో సుమారు 45 మందికి క్షణాల్లో అగ్నికి ఆహుతైన సంగతి తెలిసినదే. డీజిల్ ట్యాంక్ పేలి ఉండటం వల్లనే మంటలు శరవేగం వ్యాపించి ఉంటాయని, అందుకే ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉందని ప్రాధమిక విచారణలో అధికారులు వెల్లడించారు.
అయితే, వోల్వో ప్రతినిధులు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. వాస్తవానికి స్వీడన్‌కు చెందిన ఈ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీకి అధునాతన సేఫ్టీ ఫీచర్లను పరిచయం చేయటంలోను అలాగే అత్యంత సురక్షితమైన వాహనాలను తయారు చేయటంలోను ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. వోల్వో తయారు చేసే కార్లు ప్రపంచంలో కెల్లా అత్యంత సురక్షితమైన కార్లుగా పరిగణిస్తుంటారు.

కానీ మహబూబ్‌నగర్‌లో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి మాత్రం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా లేక బస్సులోని సాంకేతిక లోపాలే కారణమా అనే దిశగా విచారణ జరుగుతోంది. ఇప్పటికే వోల్వో కంపెనీకి చెందిన ఇంజనీర్ల బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించి, వివరాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉంది.
అధికారులు మాత్రం ఖచ్చితంగా డీజిల్ ట్యాంక్ పేలడం వల్లనే ప్రమాదం జరిగి ఉండొచ్చని చెబుతుంటే, వోల్వో బృందం మాత్రం అలా జరిగే అవకాశమే లేదని చెబుతున్నారు. ఈ ట్యాంక్ రోటో మోల్డెడ్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడినదని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనే పేలే ఆస్కారం లేదని వోల్వో ఇంజనీర్ల బృందం చెబుతోంది. ప్రమాద తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే డీజిల్ ట్యాంక్‌కు రంధ్రం పడుతుందే తప్ప, పేలే అవకాశం లేదని, తమ కంపెనీ చరిత్రలో ఇప్పటి వరకు డీజిల్ ట్యాంక్ పేలిన సంఘటనలు నమోదు కాలేదని గట్టిగా చెబుతున్నారు.
ఇంజన్‌లో సాంకేతిక లోపం లేదా ఏదైనా అదనపు వైరింగ్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని లేదంటే డిక్కీలో ఏవైనా ప్రమాదకర కెమికల్స్ ఉండటం వలన కూడా ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుందని వారు వాదిస్తున్నారు. ఈ బస్సులో తయారీ లోపాలు కూడా లేవని, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వోల్వో ఇంజనీర్లు చెబుతున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు సిఐడి దర్యాప్తును కూడా చేపట్టనున్నారు.

ఏదేమైనప్పటికీ, ఎవ్వరు చేసిన పాపమో తెలియదు కానీ, ఈ ప్రమాదంలో 45 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయి, తమ బంధుమిత్రులకు తీరని లోటును మిగిల్చారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా, 45 మంది అసువులు బాసిన తర్వాత కానీ మన అధికారులకు మెలకువ రాలేదు. ఈ సంఘటన జరిగిన తక్షణమే అధికారులు ఇతర ట్రావెల్ ఏజెన్సీల బస్సులను తనిఖీలు చేయటం ప్రారంభించారు.
ఈ తనిఖీల్లో అనేక లొసులుగు బయటపడుతున్నప్పటికీ, కేసులు మాత్రం నామమాత్రంగానే నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి గ్రహించిన కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు ఏకంగా తమ కంపెనీలకు తాళాలు వేసుకొని తాత్కాలిక సెలవును కూడా తీసేసుకుంటాన్నాయి. మరి ఈ తనిఖీలు ఇలానే నిరంతరం కొనసాగుతాయే లేక ప్రజలు ఈ సంఘటను మర్చిపోయే వరకు మాత్రమే జరుగుతాయో వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








