ఆగస్టులో క్యామ్రీ హైబ్రిడ్‌ను విడుదల చేయనున్న టొయోటా
జపనీస్ ఆటో దిగ్గజం టొయోటా భారత్‌లో మరొక కొత్త హైబ్రిడ్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. గ్లోబల్ మార్కెట్లలో అంత్యంత పాపులర్ అయిన 'టొయోటా క్యామ్రీ' హైబ్రిడ్ కారును రానున్న ఆగస్ట్ నెలలో టొయోటా భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం టొయోటా భారత మార్కెట్లో తమ ప్రియస్ హైబ్రిడ్ కారును విక్రయిస్తోంది. అయితే, ఈ మోడల్ దేశీయ విపణిలో అతికష్టమ్మీద అమ్ముడుపోతుంది.
భారత మార్కెట్లో హైబ్రిడ్ కార్లకు లభిస్తున్న స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అందుకే పలు కార్ కంపెనీలు తమ హైబ్రిడ్ కార్లను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం టొయోటా చాలా ధీమాగా ఉంది. క్యామ్రీ హైబ్రిడ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా భారత్‌లో నెలకు 20-25 యూనిట్లను విక్రయంచగలని కంపెనీ విశ్వసిస్తోంది. ఇది మొత్తం క్యామ్రీ అమ్మకాల్లో 5-6 శాతం ఉంటుంది.

రెగ్యులర్ క్యామ్రీకి వ్యత్యాసాన్ని చూపించే విధంగా ఈ హైబ్రిడ్ వెర్షన్ క్యామ్రీలో అనేక మార్పులు ఉండనున్నాయి. వెలువలి వైపు విభిన్నమైన బంపర్, క్రోమ్ గ్రిల్, వెడల్పాటి ఎయిర్ డ్యామ్, క్రోమ్ ఇన్‌సెర్ట్‌తో కూడిన రీస్టయిల్డ్ ఫాగ్ ల్యాంప్స్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు గమనించవచ్చు. ఇది హైబ్రిడ్ కారు అని తెలిపేందుకు గాను వెనుక వైపు 'హైబ్రిడ్ సైనర్జీ డ్రైవ్' అనే బ్లూ బ్యాడ్జ్ ఉంటుంది.
ఇంటీరియర్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, త్రీ డయల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రీమియం సీట్ ఫ్యాబ్రిక్ వంటి ప్రధాన మార్పులు ఉండనున్నాయి. ఇందులో 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 640 వోల్ట్స్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఈ ఇంజన్ ఈ-సివిటి (ఎలక్ట్రానికి కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది.
పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 146 హెచ్‌పిల గరిష్ట శక్తిని, 187 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ మోటార్ 140 పిఎస్‌ల గరష్ట శక్తిని, 270 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 189 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. భారత మార్కెట్లో దీని ధర రూ.36 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఈ ధర పెట్రోల్ క్యామ్రీ కన్నా సుమారు రూ.12 లక్షలు అధికం.


Click it and Unblock the Notifications








