భారత్ కోసం ఫోక్స్‌వ్యాగన్ అప్ ఆధారంగా ఓ కాంపాక్ట్ సెడాన్!
భారత్‌కు కాంపాక్ట్ సెడాన్ ఫీవర్ పట్టుకుంది. ఇటీవల భారత సర్కార్ చేసిన బడ్జెట్ సవరణల్లో భాంగగా, నాలుగు మీటర్ల కన్నా తక్కువ (సబ్ 4-మీటర్) పొడవు కలిగిన కార్లపై తక్కువ ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తుండటంతో, కార్ల తయారీ కంపెనీలన్నీ ఇప్పుడు కాంపాక్ట్ సెడాన్ల తయారీపై దృష్టి సారించాయి.
ఇప్పటికే ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్, వెరిటో వైబ్ వంటి మోడళ్లు విడుదలైన సంగతి తెలిసినదే. మరోవైపు టాటా మోటార్స్ కూడా ఇండిగో ఈసిఎస్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ కాంపాక్ట్ కారును తీర్చిదిద్దుతుండగా, పురాతన ఆటోమొబైల్ కంపెనీ హిందుస్థాన్ మోటార్స్ కూడా అంబాసిడర్ ప్లాట్‌ఫామ్‌పై ఓ చిన్న కారును తయారు చేస్తోంది.

తాజాగా.. ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించేందుకు జర్మన్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఉరకలు వేస్తోంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కోసం ఫోక్స్‌వ్యాగన్ ఓ సబ్-4 మీటర్ కారును తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫోక్స్‌వ్యాగన్‌కు భారత మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పోలో, ఎగ్జిక్యూటివ్ సెడాన్ వెంటో మోడళ్లు ఉండగా, సరసమైన ధరకు లభించే ఎంట్రీ లెవల్ మోడల్ మిస్ అయింది.
ఈ నేపథ్యంలో, ప్రస్తుత వెంటో సెడాన్ కన్నా తక్కువ ధరకే లభించేలా ఫోక్స్‌వ్యాగన్ ఓ వెంటోకు దిగువన ఓ కాంపాక్ట్ కారును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే, ఇందు కోసం ఇప్పటికే కంపెనీలు తమ హ్యాచ్‌బ్యాక్ కార్లకు బూట్‌ను తగిలించి సెడాన్లను (ఉదాహరణకు స్విఫ్ట్ - డిజైర్, బ్రియో - అమేజ్) తయారు చేస్తున్నాయి. కానీ ఫోక్స్‌వ్యాగన్ పోలో విషయంలో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ఎందుకంటే, ఫోక్స్‌వ్యాగన్ పోలో ఇప్పటికే 3970 మి.మీ. పొడవును కలిగి ఉంటుంది. దీనిని మరింత పెంచడం సాధ్యం కాదు. అందుకే, ఫోక్స్‌వ్యాగన్ పాపులర్ గ్లోబల్ స్మాల్ కార్ అప్ ప్లాట్‌ఫామ్‍ను ఆధారంగా చేసుకొని ఓ కాంపాక్ట్ కారును విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఈ చిన్న కారును పిక్యూ12 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇది 3540 మి.మీ. పొడవును కలిగి ఉంటుంది.
ఫలితంగా, ఈ చిన్న కారును కాంపాక్ట్ సెడాన్‌గా తీర్చిదిద్దటం సాధ్యమవుతుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్లాట్‌ఫామ్‌పై ఇప్పటికే ఓ కాంపాక్ట్ సెడాన్ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ కాంపాక్ట్ సెడాన్‌ను అప్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా కాకపోయినా ఇదే ప్లాట్‌ఫామ్‌పై (పిక్యూ12) తయారవుతున్న/కానున్న ఇతర వాహనాలను (ఉదా టైగన్) ఆధారంగా చేసుకొని ఓ కాంపాక్ట్ సెడాన్ తయారయ్యే అవకాశం ఉంది. 2015 నాటికి ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








