డస్టర్, ఈకోస్పోర్ట్ అమ్మకాలకు టెర్రానో చెక్ పెడుతుందా?
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా, దేశీయ విపణి కోసం 'టెర్రానో' అనే ఓ ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. రానున్న దసరా, దీపావళి పండగల సందర్భంగా అక్టోబర్‌లో నిస్సాన్ టెర్రానోను వాణిజ్య పరంగా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని, దీని ధర రూ. 10 లక్షల రేంజ్‌లో ఉంటుందని, ఈ కారు కోసం సెప్టెంబర్ నెల నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీని పరిగణలోకి తీసుకుంటే, నిస్సాన్ టెర్రానో రాకతో ఈ సెగ్మెంట్లోని బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్‌గా ఉన్న ఈకోస్పోర్ట్, డస్టర్ వంటి మోడళ్ల అమ్మకాలు ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, ఈ రెండు మోడళ్లతో పోల్చుకుంటే నిస్సాన్ టెర్రానో ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ ప్రభావం పెద్దగా ఉండబోదని తెలుస్తోంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కోసం కొనుగోలుదారులు ఇప్పటికే సుమారు 9 నెలల వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కొన్ని రకాల ఈకోస్పోర్ట్ వేరియంట్ల బుకింగ్‌లను కూడా కంపెనీ నిలిపివేసింది. దీంతో కొనుగోలుదారులకు ప్రత్యామ్నాయ ఆప్షన్‌గా ప్రీమియం టెర్రానో నిలువనుంది. టాప్ ఎండ్ వేరియంట్ ఈకోస్పోర్ట్ కొనదలచుకునే కస్టమర్లు, ఆ ధరకు మిడ్-లెవల్ వేరియంట్ టెర్రానోను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇక రెనో డస్టర్ విషయానికి వస్తే, ఇది టెర్రానో కన్నా తక్కువ ధరను కలిగి ఉంటుంది. కానీ, టెర్రానో మాదిరిగా ప్రీమియం లుక్‌ను మాత్రం కలిగి ఉండదు. టెర్రానో, డస్టర్‌లలో ఉపయోగించిన ఇంజన్లు, దాదాపు అన్ని సాంకేతిక ఫీచర్లు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి, ధరకు కాకుండా డిజైన్‌కు ప్రాధాన్యత ఇచ్చే కస్టమర్లు డస్టర్‌ను వదిలి టెర్రానోను ఆశ్రయించే ఆస్కారం ఉంది. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే, నిస్సాన్ టెర్రానో రాకతో ఈ సెగ్మెంట్లో పోటీ మరింత వేడెక్కె సూచనలు కనిపిస్తున్నాయి.



Click it and Unblock the Notifications









