పూనే ఫియట్ కెఫేలో అబార్త్ 500 కారు ప్రదర్శన
ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో తమ పెర్ఫార్మెన్స్ వెర్షన్ 'అబార్త్ 500'ను ప్రదర్శించిన సంగతి తెలిసినదే. ఫియట్ 2014 సంవత్సరానికి గాను మొత్తం నాలుగు అబార్త్ 500 కార్లను ఇండియాలో విక్రయించాలనుకుంది. అందులో ఒకటే ఈ అబార్త్ 500.
ఆరంభంలో భాగంగా ఫియట్ తమ అబార్త్ బ్రాండ్ కార్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన కారును ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించాలని సన్నాహాలు చేస్తోంది. అయితే, భవిష్యత్తులో వీటిని సరసమైన ధరకే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా వాటిని ఇక్కడే అసెంబ్లింగ్ చేయాలని కూడా కంపెనీ యోచిస్తోంది.

అబార్త్ బ్రాండ్ కోసం ఫియట్ ప్రత్యేకమైన షోరూమ్‌లను ఏర్పాటు చేయదు, ప్రస్తుతం ఫియట్ స్థాపిస్తున్న స్వంత డీలర్‌షిప్ కేంద్రాల్లోనే వీటిని కూడా ప్రదర్శిస్తారు. ఈ నేపథ్యంలో, ఫియట్ తాజాగా తమ అబార్త్ 500 కారును పూనేలో ఏర్పాటు చేసిన ఫియట్ కెఫేలో ప్రదర్శనకు ఉంచింది. తమకు భారత్‌లోని కీలక మార్కెట్లలో పూనే కూడా ఒకటని, ఇక్కడ అధిక ఆదాయం కలిగిన యువత ఎక్కువ సంఖ్యలో ఉందని ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ నాగేష్ బసవనహల్లి తెలిపారు.


Click it and Unblock the Notifications








