ఆటోరిక్షాల్లో జిపిఎస్ ఆధారిత మీటర్లు, డెబిట్ కార్డ్ పేమెంట్స్
ఆటోరిక్షా రంగంలో సరికొత్త విప్లవాలకు తెరలేపుతూ, కొచ్చిలో కొత్త రకం సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా, కొచ్చిలో జిపిఎస్ ఆధారిత మీటర్లను ఉపయోగించనున్నారు. అంతేకాకుండా, ఆటో చార్జీని డెబిట్ కార్డుల ద్వారా చెల్లించే సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు.
ఈ కొత్త ఐడియాకు కొచ్చి జిల్లా అడ్మినిస్ట్రేషన్ శ్రీకారం చుట్టింది. ప్రయాణీకుల నుంచి ఆటో డ్రైవర్లు అధిక మొత్తాల్లో డబ్బులు గుంజుతున్నారనే ఫిర్యాదులు ఎక్కువ అవుతుండటం, అలాగే ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని నగరంలో ఆటోరిక్షాలలో ఈ ఫీచర్లను పొందుపరచాలని ప్రతిపాదించారు.
ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన మాత్రమే అయినప్పటికీ, దీనికి అటు ప్రజల నుంచి ఇటు ఆటోరిక్షా డ్రైవర్ల నుంచి కూడా సానుకూల స్పందన లభిస్తుండటంతో, త్వరలోనే ఇది ఆచరణలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలో భాగంగా, ఆటోరిక్షాలలో ఎక్కువ ప్రయాణించే వారు తమ చార్జీని డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు.

పెద్ద మొత్తాలను ఇలా కార్డు ద్వారా చెల్లించడం వలన ఆటో డ్రైవర్లు ఎంత మేర చార్జీలు వసూలు చేస్తున్నారనే విషయం కూడా రికార్డు అవుతుంది కాబట్టి, వారు భారీ మొత్తాలను కస్టమర్ల నుంచి డిమాండ్ చేసేందుకు ఆస్కారం ఉండదు. మరోవైపు జిపిఎస్ ఆధారిత మీటర్ల వలన ఆటోరిక్షా ఎప్పుడు, ఎక్కడ ఏ రూట్లో ప్రయాణిస్తుందో తెలుసుకోవటం సులువు కానుంది.
ఇలాంటి సేవలు కేవలం కొచ్చి నగరానికి మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని అన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించే, ఆటోరిక్షాలో ప్రయాణం సుఖవంతంగాను, సురక్షితంగాను మారే అవకాశం ఉంటుంది. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications








