భారత్‌లో 40,000వ బిఎమ్‌డబ్ల్యూ కారు ఉత్పత్తి!
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, గత కొన్నేళ్లుగా దేశీయ విపణిలో ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా, బిఎమ్‌డబ్ల్యూ భారత్‌లో ఓ కొత్త ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. తమిళనాడులోని చెన్నైకి సమీపంలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ప్లాంట్‌లో కంపెనీ ఇప్పటి వరకూ 40,000 కార్లను ఉత్పత్తి చేసింది.
స్థానికంగా ఉత్పత్తి చేసిన ఈ 40,000వ కారు ఓ బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ లగ్జరీ కారు. బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వోన్ సార్, బిఎమ్‌డబ్ల్యూ ప్లాంట్ చెన్నై మేనేజింగ్ డైరెక్టర్ రాబెర్ట్ ఫ్రిట్రాంగ్‌లు చెన్నై ప్లాంట్ నుంచి ఈ 40,000వ కారును విడుదల చేశారు.

బిఎమ్‌డబ్ల్యూ చెన్నై ప్లాంట్‌ను మహీంద్రా వరల్డ్ సిటీ వద్ద ఉంది, ఈ ప్లాంట్‌లో 2007వ సంవత్సరం నుంచి ఉత్పత్తి జరుగుతోంది. ఈ ప్లాంట్‌లో 1 సిరీస్, 3 సిరీస్, 3 సిరీస్ జిటి, 5 సిరీస్, 7 సిరీస్, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5 మొదలైన మోడళ్లను అసెంబ్లింగ్ చేస్తున్నారు. ఇవే కాకుండా కంపెనీ విక్రయిస్తున్న మినీ బ్రాండ్ కంట్రీమ్యాన్ మోడల్‌ను కూడా ఇందులో ఉత్పత్తి చేస్తున్నారు.
ఈ ప్లాంట్ కోసం ఇప్పటి వరకు 51.8 మిలియన్ యూరోలు (సుమారు రూ.400 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ పేర్కొంది. జులై 2012 నాటికి ఈ ప్లాంట్‌లో 25,000 కార్ల ఉత్పత్తిని చేరుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. బిఎమ్‌డబ్ల్యూ ఈ నెలలో మరిన్ని కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేయనుంది. ఇందులో ముందుగా నవంబర్ 19న కొత్త మినీ కారును, ఆ తర్వాత నవంబర్ 26న బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3, ఎమ్4 కార్లను విడుదల చేయనుంది.
ఇవే కాకుండా.. బిఎమ్‌డబ్ల్యూ తమ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారును కూడా పరిమిత సంఖ్యలో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, వచ్చే ఏడాది కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న మోడళ్లలో మరిన్ని రిఫ్రెష్డ్ మోడళ్లను ప్రవేశపెట్టనుంది.


Click it and Unblock the Notifications








