సిగరెట్ల కన్నా కార్లపైనే టాక్స్‌లు ఎక్కువ: హోండా కార్స్ ఇండియా
భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన సిగరెట్ల కన్నా కూడా కార్లపైనే ఎక్కువ టాక్స్ (పన్ను)లు విధిస్తున్నారని హోండా కార్స్ ఇండియా వ్యాఖ్యానించింది. భారతదేశంలో ఆటోమొబైల్ రంగం ఎదుర్కుంటున్న సవాళ్ల గురించి ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలో కార్లపై ఎక్సైజ్ డ్యటీ, సిఎస్‍టి, కలామిటీ టాక్స్, ఎడ్యుకేషన్ సెస్, వ్యాట్, రోడ్ టాక్స్ ఇలా అనేక రకాల పన్నులను వసూలు చేస్తున్నారని, బహుశా ఆరోగ్యానికి హాని కలిగించే సిగరెట్లు వంటి వాటిపై విధించే పన్నుల కన్నా కార్లపైనే ఎక్కువ పన్నులు విధిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
కార్లపై ఈ పన్నులు అత్యధికంగా ఉన్నాయని జ్ఞానేశ్వర్ సేన్ అన్నారు. కార్లను బట్టి, పన్నులు 50 శాతం నుంచి 70 శాతం వరకు ఉంటున్నాయని ఆయన తెలిపారు. దీనికి ఆయన ఓ ఉదాహరణ చెబుతూ ఇలా అన్నారు.. ఉదాహరణకు తాము ఫ్యాక్టరీలో తయారైన రూ.100 లకు విక్రయిస్తే, ఈ అధిక పన్నులు కస్టమర్లు ఆ కారును రూ.150 నుంచి రూ.175లు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారని అన్నారు. రవాణా ఖర్చులు, డీలర్ మార్జిన్లు కలుపుపోకుండానే పన్నులు 50-70 శాతం ఉంటున్నాయన్నారు.

అంతేకాకుండా.. ఈ పన్నుల విధానం దేశంలోని సమానంగ ఉండకపోవటాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ 12.5 శాతంగా ఉంటే, కొన్ని రాష్ట్రాల్లో 14.5 శాతంగా ఉంటోందని, అలాగో రోడ్ టాక్స్ కొన్ని రాష్ట్రాల్లో 4 శాతంగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో గరిష్టంగా 16 శాతం వరకు ఉంటోదని జ్ఞానేశ్వర్ సేన్ చెప్పారు. డీజిల్ సబ్సిడీపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉందని, దీనిపై స్పష్టత లేకపోవటం వల్లనే చాలా మంది కొనుగోలుదారులు డీజిల్ కార్లను కొనే విషయంలో వెనుకంజ వేస్తున్నారని అన్నారు.
ఇంధనం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కార్ పరిశ్రమపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోందని, పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధరలను బట్టి ఆయా వాహనాల కొనుగోళ్లు ప్రభావితమవుతాయని ఆయన వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications








