మైఖేల్ షుమాకర్ ఆరోగ్యంలో పురోగతి కనిపిస్తోంది: వైద్యులు
మైఖేల్ షుమాకర్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా మరో అప్‌డేట్ విడుదలైంది. వరుసగా 7 సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకున్న ఫార్ములా వన్ దిగ్గజం మైఖేల్ షుమాకర్ గడచిన సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగిన స్కీయింగ్ ప్రమాదంలో క్రిందపడి తలకు బలమైన గాయం కావటంతో కోమాలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసినదే.
ప్రస్తుతం మైఖేల్ షుమాకర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, మీడియా కంటపడకుండా రహస్య ప్రదేశంలో చికిత్స అందజేస్తున్నారు. గడచిన నెలలో షుమాకర్‌ను సందర్శించిన ఫార్ములా వన్ కామెంటేటర్ జీన్ లూయిస్ మోన్సెట్, షుమాకర్ చాలా నెమ్మదిగా కోలుకుంటున్నాడని, అతను పూర్తిస్థాయిలో కోలుకోవటానికి చాలా సమయం పట్టొచ్చని వెల్లడించడం జరిగింది.
అయితే, తాజాగా.. షుమాకర్‌కు గ్రెనోబల్ ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులలో ఒకరైన ఇయాన్-ఫ్రాంకోయిస్ పేయెన్ అతని ఆరోగ్య పరిస్థితి గురించి అప్‌డేట్స్ విడుదల చేశారు. అతని (షుమాకర్) ఆరోగ్య పరిస్థితిలో కొంత మెరుగుదల చూశానని, అయితే అతనికి ఇంకా కొంచె సమయం ఇవ్వటం మంచిదని, మైఖేల్ ఇప్పుడు తన భార్యా పిల్లలతో మంచి వాతావరణంలో ఉన్నారని చెప్పారు.

షుమాకర్ పూర్తిగా కోలుకోవటానికి ఎంత సమయం పడుతుందన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఇతర పేషెంట్ల మాదిరిగానే, షుమాకర్ విషయంలో కూడా తాము టైమ్‌స్కేల్‌ను పాటిస్తున్నామని, అది ఒక ఏడాదా లేక మూడేళ్లా అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేమని, అప్పటి వరకూ ఓర్పుగా వేచి ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు.
కాగా.. షుమాకర్ స్కీయింగ్ యాక్సిడెంట్‌కు సంబంధించి ఇప్పటికీ ఓ స్పష్టమైన నివేదిక బయటి రాలేదు. తలకు బలమైన రాయి తగలటం వలన అతను కోమాలోకి వెళ్లాని ఇదివరకటి రిపోర్టులు చెబుతుంటే, తాజా రిపోర్టులు మాత్రం షుమాకర్ తలపై ఉన్న హెల్మెట్‌కు అమర్చిన గోప్రో కెమెరా వల్లనే యాక్సిడెంట్ జరిగి ఉంటుందని చెబుతున్నాయి. యాక్సిడెంట్‌కు కారణం ఏదైనా సరే, ఇప్పుడు అతను త్వరగా కోలుకోవటమే అందరికీ కావల్సినది.


Click it and Unblock the Notifications