ఎక్సైజ్ సుంకం తగ్గింపు వలన పుంజుకున్న కార్ల అమ్మకాలు
గత కొద్ది నెలలుగా దిగజారుతూ వస్తున్న కార్ల అమ్మకాలు గడచిన ఫిబ్రవరి నెలలో కాస్తంత వేగం పుంజుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం, కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో వాహనాలపై ఎక్సైజ్ సంకాన్ని తగ్గించడమే. డ్యూటీ తగ్గింపు నేపథ్యంలో, కార్ల తయారీదారులు కూడా తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించడంలో కొనుగోళ్లు జోరందుకున్నాయి.
మరోవైపు ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పో కూడా సానుకూల సెంటిమెంట్‌ను సృష్టించడం కూడా అమ్మకాల పెరుగుదలకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. మొత్తమ్మీద చూసుకుంటే, ఫిబ్రవరి 2014 నెలలో మొత్తం దేశీయ కార్ల అమ్మకాలు 1.39 శాతం వృద్ధి చెందాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ఓ ప్రకటనలో పేర్కొంది.

ఫిబ్రవరి 2013లో దేశీయంగా మొత్తం 1,58,512 కార్లు అమ్ముడుపోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.39 శాతం వృద్ధితో 1,60,718 కార్లు ఉమ్ముడయ్యాయని సియామ్ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో మాత్రం పరిస్థితి ఇంత సానుకూలంగా ఉండబోదని, ఆటోమొబైల్ పరిశ్రమకు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సివస్తుందని సియామ్ హెచ్చరించింది.
కాగా.. ఏప్రిల్ 2013 నుంచి ఫిబ్రవరి 2014 వరకూ చూస్తే.. ఈ కాలంలో మొత్తం అమ్మకాలు 4.6 శాతం వరకు తగ్గుముఖం పట్టగా, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 5.9 శాతం వరకు క్షీణంచాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ప్యాసింజర్, వాణిజ్య వాహనాలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. మార్చి నెలలో అమ్మకాలుపుంజుకున్నా.. మొత్తం ఆర్థిక సంవత్సరానికి పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే పెద్దగా పెరిగే అవకాశం కనిపించడం లేదని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాధూర్ విలేకరులకు చెప్పారు.


Click it and Unblock the Notifications








