యాక్సిలరేషన్‌లో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఎలక్ట్రిక్ కార్
ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువ వేగంతో వెళ్లవు అనే అపోహ చాలా మందిలో ఉంటుంది, కానీ ఈ న్యూస్ చదివితే మాత్రం అవాక్కవ్వక తప్పదు. స్విట్జర్లాండ్‌కు చెందిన విద్యార్థులు తయారు చేసిన ఓ సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్, యాక్సిలరేషన్‌లో ఓ కొత్త స్పీడ్ రికార్డును సృష్టించింది.
ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ కేవలం 1.78 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. గతంలో ఓ ఎలక్ట్రిక్ కారు సెట్ చేసిన స్పీడ్ రికార్డ్ (2.3 సెకండ్స్)ను స్విట్జర్లాండ్ విద్యార్థులు తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారుతో బ్రేక్ చేశారు.
స్విట్జర్లాండ్ లోని ఈటిహెచ్ జురిచ్ అండ్ లూసెరెన్ యూనివర్సిటీ ఆఫ్ అప్లయిడ్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్ విద్యార్థులు ఈ రికార్డును సృష్టించారు. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును విద్యార్థులే స్వయంగా డిజైన్ చేసి, నిర్మించారు. ఈ కారుకు 'గ్రిమ్సెల్' అనే పేరును పెట్టారు.

గ్రిమ్సెల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును డ్యూబెన్‌డోర్ఫ్ మిలటరీ ఎయిర్‌ఫీల్డ్స్‌పై టెస్ట్ చేశారు. కేవలం 30 మీటర్ల దూరానికే ఈ ఎలక్ట్రిక్ 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన ఈ కారు బరువు 168 కేజీలు. ఇది గరిష్టంగా 200 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
మొత్తం 30 మంది విద్యార్థులు కలిసి, ఏడాది కన్నా తక్కువ సమయంలోనే ఈ కారును తయారు చేశారు. ఈ ఎలక్ట్రిక్ కారులో ప్రతి చక్రంలో ఒక్కో మోటార్ చొప్పున మొత్తం నాలుగు మోటార్లు ఉంటాయి. ఇవి నాలుగు కలిసి 1630 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఫోర్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో పనిచేస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ యాక్సిలరేషన్‌ను పెంచేందుకు గాను ప్రతి చక్రంలో టార్క్ పంపణీ సమానంగా జరుగుతుంది. గతంలో ఈ స్పీడ్ రికార్డును సెట్ చేసినది డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. ఈ రికార్డును స్విట్జర్లాండ్ లోని ఈటిహెచ్ జురిచ్ అండ్ లూసెరెన్ యూనివర్సిటీ ఆఫ్ అప్లయిడ్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్ విద్యార్థులు బ్రేక్ చేసి, కొత్త స్పీడ్ రికార్డు సృష్టించారు.


Click it and Unblock the Notifications








