కొత్త బడ్జెట్‌లో ఎక్సైజ్ డ్యూటీ కట్ కొనసాగించాలి: కార్ మేకర్లు
ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం (కాంగ్రెస్)లోని కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు మరియు వాణిజ్య వాహనాలపై 12 శాతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 8 శాతానికి తగ్గించారు (మొత్తం 4 శాతం తగ్గింపు విధించారు).
అలాగే, మిడ్-సైజ్ సెడాన్లపై సుంకాన్ని 24 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు (4 శాతం తగ్గింపు). ఎస్‌యూవీలపై సుంకాన్ని 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిన (6 శాతం తగ్గింపు) విషయం తెలిసినదే. అయితే, ఈ మధ్యంతర బడ్జెట్ గడువు జూన్ 30, 2014తో మగిసిపోతుంది.
ఈ నేపథ్యంలో కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం (బిజెపి) జూన్ 30 తర్వాతి నుంచి ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్‌లో ఎక్సైజ్ డ్యూటీ కట్‌ను అలానే కొనసాగించాలని, దానిని సవరించినా లేదా డ్యూటీని పెంచినా వాహనాల అమ్మకాలు మళ్లీ తగ్గిపోయే ప్రమాదం ఉందని కార్ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

గడచిన మధ్యంతర బడ్జెట్‌లో ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో అనేక కార్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను కూడా తగ్గించి, ఈ డ్యూటీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులపైకి బదిలీ చేశాయి. అయితే, కొత్తగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఎక్సైజ్ డ్యూటీని పెంచినట్లయితే, కార్ కంపెనీలు మరోసారి తిరిగి తమ ఉత్పత్తుల ధరలను పెంచి, ఆ భారాన్ని వినియోగదారులపై మోపే ఆస్కారం ఉంటుంది.
ఇప్పటికే, రైలు చార్జీలు పెంచి ప్రయాణీకులపై అధనపు భారం మోపిన మోడీ సర్కారు, ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications








