జోరు మీదున్న ఫియట్ అవెంచురా; బుకింగ్స్ వెల్లువ
ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఇండియా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన అవెంచురా కాంటెంపరరీ అర్బన్ వెహికల్ (సియూవి) కంపెనీ ఆశించిన రీతిలో విజయాన్ని కనబరుస్తోంది. కేవలం రూ.5.99 లక్షల ప్రారంభ ధరకే మార్కెట్లో విడుదలైన ఫియట్ అవెంచురాకు బుకింగ్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ మోడల్‌కు 500 యూనిట్లకు పైగా ఆర్డర్లు వచ్చినట్లు సమాచారం.
ఫియట్ అవెంచురాకు ఎంక్వైరీలు ఎక్కువగా వస్తున్నాయని ఫియట్ ఇండియా డీలర్లు చెబుతున్నారు. ఫియట్ ఇటీవలే విడుదల చేసిన పుంటో ఇవో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అవెంచురాను తయారు చేశారు. ఫియట్ అవెంచురా సియూవి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం ఐదు వేరియంట్లలో (2 పెట్రోల్, 3 డీజిల్) లభిస్తుంది.

భారతీయ పరిస్థితులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫియట్ అవెంచురాను డిజైన్ చేశారు. పూనేలో ఉన్న రంజన్ గావ్ ప్లాంట్‌లో ఈ మోడల్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుతానికి భారత మార్కెట్లో మాత్రమే ఈ మోడల్‌ను విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
పెట్రోల్ వెర్షన్ ఫియట్ అవెంచురాలో 1368సీసీ ఫైర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పిల శక్తిని, 115 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరుకు 14.4 కి.మీ. మైలేజీనిస్తుంది.
డీజిల్ వెర్షన్ ఫియట్ అవెంచురాలో 1248సీసీ మల్టీజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 93 బిహెచ్‌పిల శక్తిని, 197 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరుకు 20.5 కి.మీ. మైలేజీనిస్తుంది.
పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు రెండూ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తాయి. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ అందుబాటులో లేదు. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ లేకపోవటం ఆఫ్-రోడ్ ప్రియులను నిరుత్సాహానికి గురిచేసే అంశం.


Click it and Unblock the Notifications








