ఈ ఏడాదిలో ఫియట్ నుంచి 4 కొత్త కార్లు విడుదల
మార్కెట్లో ఫియట్ కార్లకు మంచి స్పందన లభిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ నాటికి అదనంగా మరో నాలుగు కొత్త మోడళ్లను దేశీయ విపణిలో విడుదల చేస్తామని ఫియట్ గ్రూపు ఆటోమొబైల్స్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌జిఏఐపిఎల్)కి చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఈ ఏడాది ఆకర్షణీయమైన మోడళ్లను మార్కెట్లో విడుదల చేయనున్నామని, ఇప్పటికే తాము మార్కెట్లో సరికొత్త లీనియా సెడాన్‌ను విడుదల చేశామని, మరికొద్ది రోజుల్లోనే సరికొత్త పుంటో హ్యాచ్‌బ్యాక్‌ను కూడా విడుదల చేస్తామని ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ నాగేశ్ బసవనహళ్లి తెలిపారు.

కొత్త ఫియట్ పుంటోతో పాటుగా అవెంచురా (కాంటెంపరరీ యుటిలిటి వెహికిల్ (సీయువీ))ను కూడా భారత్‌లో మొదటిసారి ఆవిష్కరిస్తామని, దీంతో పాటు అబార్త్ బ్రాండ్ క్రింద ఫియట్ 500 అబార్త్ మోడల్‌ను కారును కూడా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఏడాది తాము విడుదల చేయనున్న కొత్త మోడళ్లతో మార్కెట్‌ను ఆకట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో ఆటోమొబైల్ రంగం పరిస్థితి గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం మందకొడిగా సాగుతున్న ఆటో రంగం ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధభాగం నుంచి పుంజుకునే అవకాశం ఉందని అన్నారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో తాము దేశీయ విపణిలో మొత్తం 20.47 లక్షల కార్లను విక్రయించామని వివరించారు.
DON'T MISS: FACEBOOK VIDEO OF THE DAY


Click it and Unblock the Notifications