మూడు ప్రధాన సమస్యలు: ఫోర్డ్ ఈకోస్పోర్ట్ రీకాల్
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్, భారత మార్కెట్లో ఉత్పత్తి చేసిన ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని పలు అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ఫోర్డ్ చెన్నై ప్లాంట్‌లో తయారైన ఈ ఎస్‌యూవీలు పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. కాగా.. ఇప్పుడు ఈ ఎక్స్‌పోర్ట్ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో 3 ప్రధాన సమస్యలను గుర్తించారు.
వైరింగ్ హార్నెస్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్ డిప్లాయ్‌మెంట్, సైడ్ ఇంపాక్ట్ సెన్సార్ అండ్ సీట్ బెల్ట్ ప్రీటెన్షనర్ సమస్యల కారణంగా, ఆస్ట్రేలియాకు ఎగుమతి చేసిన మేడ్ ఇన్ ఇండియా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కార్లను కంపెనీ రీకాల్ చేసింది. సుమారు 2,804 యూనిట్ల ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఈ రీకాల్‌కు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది.

జూన్ 15, 2013 నుంచి ఆగస్ట్ 26, 2014 మధ్య కాలంలో ఉత్పత్తై, ఆస్ట్రేలియాకు ఎగుమతైన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కార్లలో ఈ సమస్యను గుర్తించారు. అయితే, ఈ రీకాల్ టకాటా ఎయిర్‌బ్యాగ్ సమస్యకు సంబంధించినది కాదని ఫోర్డ్ స్పష్టం చేసింది. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఈ కారులో కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ (సైడ్ విండో వద్ద ఉండే ఎయిర్‌బ్యాగ్స్) తెరుచుకోకపోవచ్చని కంపెనీ వివరించింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వేరియంట్లు ఇండియాలో కూడా అమ్ముడుపోతున్నాయి. ఈకోస్పోర్ట్ టైటానియం ఏటి, టైటానియం ఆప్షనల్ వేరియంట్లు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్ ఫీచర్లతో లభిస్తాయి. మరి ఇండియాలో విక్రయించిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా పైన చెప్పిన సమస్యలు ఉన్నాయా లేదా అనే విషయంపై ఫోర్డ్ ఇండియా ఓ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications








