240 యాజమాన్య సిబ్బందిని ఇంటింకి పంపిన హిందుస్తాన్ మోటార్స్
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఉన్న ఉత్తరపర అంబాసిడర్ కార్ ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన భారతదేశపు పురాతన ఆటోమొబైల్ కంపెనీ హిందుస్తాన్ మోటార్స్, ఇప్పుడు తాజాగా కంపెనీ యాజమాన్య సిబ్బంది విధుల నుంచి తొలగించింది. మొత్తం 240 మంది యాజమాన్య సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: అంబాసిడర్ కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
అయితే, కార్మికుల విషయంలో మాత్రం కంపెనీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్లాంట్‌లో సుమారు 2500 మంది ఉద్యోగులు (కార్మికులు, మేనేజ్‌మెంట్ వ్యక్తులు) పనిచేస్తున్నారు. నిధుల కొరత, డిమాండ్ లేమి కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తరపారాలో ఉన్న ప్లాంట్‌ను మూసేశామని, ఈ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిరవధికంగా నిలిపివేస్తున్నామని, అంబాసిడర్ కారు విషయంలో ఇప్పటికే పెట్టుబడి పెట్టి చాలా నష్టపోయామని ఇకపై మరింత నష్టపోరాదనే ఉద్దేశ్యంతోనే, ఈ నిర్ణయం తీసుకున్నామని హిందుస్తాన్ మోటార్స్ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసినదే.

అంబాసిడర్ ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత ప్లాంట్‌లోను అలాగే కార్యలయంలోను చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే విధులను నిర్వహించే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి కీలక శాఖలకు చెందిన ఉద్యోగులను మాత్రం కంపెనీ ఇంకా విధుల్లోనే కొనసాగిస్తోంది.
గడచిన రెండు మూడేళ్లుగా యాజమాన్య పునఃనిర్మా ప్రక్రియ జరుగుతోందని, పనికి తగినట్లుగా మానవ వనరులను ఉపయోగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కంపెనీ కార్యనిర్వహణకు అవసరమైన కీలక సిబ్బందిని మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నామని హిందుస్తాన్ మోటార్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆయన మాటలను బట్టి, అంబాసిడర్ ఉత్పత్తి తిరిగి ప్రారంభమైనా ఆశ్చర్యపోవాల్సిన అసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ, అంబాసిడర్ శకం అంతం కావటాన్ని ఆ బ్రాండ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.


Click it and Unblock the Notifications








