కొత్త సంవత్సరంలో రానున్న సరికొత్త హోండా జాజ్
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'హోండా జాజ్' (Honda Jazz)ను కొత్త సంవత్సరంలో మార్కెట్లో విడుదల చేసేందుకు హోండా సన్నాహాలు చేస్తోంది. ఈ మోడల్ ఇప్పటికే జపాన్, థాయ్‌లాండ్ వంటి మార్కెట్లలో విడుదలై, విజయవంతంగా అమ్ముడుపోతోంది.
తాజా అప్‌డేట్ ప్రకారం, హోండా కార్స్ ఇండియా ఇప్పటికే తమ సరికొత్త జాజ్ హ్యాచ్‌బ్యాక్‌ను భారత్‌లోని తమ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తోంది. అలాగే, ఇండియన్ రోడ్లపై ఈ మోడల్ టెస్టింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది కస్టమర్లకు అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. హోండా మొబిలియో తర్వాత వస్తున్న సరికొత్త ఉత్పత్తి జాజ్ కావటం విశేషం.
బెస్ట్ ఇన్ క్లాస్ ప్రీమియం ఫీచర్లతో ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టంగా ఉండేలా హోండా తమ మోడ్రన్ జాజ్ కారును తయారు చేసింది. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌తో పోటీ పడనుంది. జాజ్ బేసిక్ డిజైన్‌ను అలానే ఉంచుతూ, ఇదివరకటి తరం జాజ్ కన్నా మరింత షార్పర్‌గా, అగ్రెసివ్ లుక్‌ని కలిగి ఉండేలా కొత్త జాజ్‌ను డిజైన్ చేశారు.

కొత్త 2015 హోండా జాజ్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో అనేక అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో హోండా తమ జాజ్ ఉత్పత్తిని, అమ్మకాలను పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కొత్తగా రీ-ఎంట్రీ ఇస్తున్న జాజ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గ్లోబల్ వెర్షన్ హోండా జాజ్ ప్రీమియం బ్యాచ్‌బ్యాక్ కారులో ఏబిఎస్, ఈబిడి, జి-కాన్ (జి ఫోర్స్ కంట్రోల్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇందులో 7-ఇంచ్ టిఎఫ్‌టి ఆడియో సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. దీనిని స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే, ఇందులో అన్ని ఫీచర్లు ఇండియన్ వెర్షన్‌లో లభిస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.

థాయ్‌లాండ్ మార్కెట్లో అమ్ముడవుతున్న జాజ్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తోంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 117 హెచ్‌పిల శక్తిని, 146 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
అయితే, ఇండియన్ వెర్షన్ హోండా జాజ్‌లో.. హోండా జాజ్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హోండా సిటీ సెడాన్ మాదిరిగానే 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లను ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








