హోండా కార్స్ ఇండియాలో కొత్తగా 1000 కొలువులు
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండ మోటర్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత్‌లో 1,000 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్‌లో హోండా ఈ ఆర్థిక సంవత్సరంలో ముగిసే నాటికి సెకండ్ షిఫ్టులో ఉత్పత్తి ప్రారంభించనుంది.
జపనీస్ హోండా మోటార్ కంపెనీకి చెందిన పూర్తి భారతీయ అనుబంధ సంస్థ అయిన హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) 2014-15 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 50 శాతం పెంచుకుని, 2 లక్షల యూనిట్లను చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగిపోతోంది.
రాజస్థాన్‌లోని తపుకారా ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి పెద్ద ఎత్తున మానవ వనరులు అవసరం అవుతుంది. తమ అంచనా ప్రకారం ఈ ఆర్థికసంవత్సరం ముగిసే నాటికి సుమారు 800 - 1000 మందిని ఈ ప్లాంట్ కోసం రిక్రూట్‌మెంట్ చేసుకుంటామని హెచ్‌సిఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ వెల్లడించారు.

హోండా కంపెనీలో ప్రస్తుతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు 9,000 మంది పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం హోండా కార్స్ ఇండియాకి భారత్‌లో రెండు ప్లాంట్‌లు ఉన్నాయి. అందులో ఒకటి గ్రేటర్ నోయిడాలోను మరొకటి తపుకారాలోను ఉన్నాయి. ఒక్క తపుకరా ప్లాంట్‌లోనే సుమారు 3,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని జ్ఞానేశ్వర్ సేన్ వివరించారు.
ఈ ప్లాంట్‌లో రెండవ షిఫ్టును ప్రారంభించడం ద్వారా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.20 లక్షల యూనిట్లకు పెంచనుంది. అలాగే 2016-17 నాటికి ఈ సామర్థ్యాన్ని 3 లక్షల యూనిట్లకు తీసుకువెళ్లాలని హోండా సన్నాహాలు చేస్తోంది. తపుకరా ప్లాంట్ కోసం సుమారు రూ.3,526 కోట్ల వరకు పెట్టుబడులను వెచ్చించామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








