భారత్‌కు తిరిగి రానున్న హోండా సివిక్ సెడాన్
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, గడచిన రెండేళ్ల క్రితం దేశీయ మార్కెట్ నుంచి తొలగించిన ప్రీమియం సెడాన్ 'హోండా సివిక్' తిరిగి భారత విపణిలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి హోండా సివిక్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానున్నట్లు సమాచారం.
గతంలో హోండా సివిక్ సెడాన్ కేవలం పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే లభ్యం కావటం, దాని ధర కూడా అధికంగా ఉండటంతో ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో జరగని కారణంగా, కంపెనీ భారత మార్కెట్‌లో సివిక్ ఉత్పత్తిని, విక్రయాలను నిలిపివేసింది.
దేశీయ విపణిలో ప్రీమియం సెడాన్ సెగ్మెంట్లో హ్యుందాయ్ ఎలాంట్రా, ఫోక్స్‌వ్యాగన్ జెట్టా, స్కొడా ఆక్టావియా, టొయోటా కరోలా ఆల్టిస్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వాలంటే ప్రస్తుతం హోండా వద్ద ఎలాంటి పటిష్టమైన ఉత్పత్తి లేదు. ఈ నేపథ్యంలో, హోండా తమ పాపులర్ గ్లోబల్ మోడల్ హోండా సివిక్‌ను తిరిగి ఇండియాకు తీసుకురావటమే కాకుండా, ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా పరిచయం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

గ్లోబల్ మార్కెట్లలో 9వ తరం హోండా సివిక్ సెడాన్ 2011లో మార్కెట్లో విడుదలైంది. అప్పట్లో డీజిల్ ఇంజన్ ఆప్షన్ (1.6 లీటర్ ఐడిటెక్)ను కేవలం యూరోపియన్ మార్కెట్లలో మాత్రమే ఆఫర్ చేశారు. ఈ ఇంజన్ వచ్చాక 2.2 లీటర్ ఐ-సిటిడి ఇంజన్లను నిలిపివేశారు.
తాజా అప్‌డేట్ ప్రకారం, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఓ 9వ తరం సివిక్ సెడాన్‌ను రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం ఇండియాకు దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. హోండా ఇప్పటికే అమేజ్, సిటీ, మొబిలియో డీజిల్ వెర్షన్లతో మంచి సక్సెస్‌ను సాధించిన నేపథ్యంలో, హోండా సివిక్ కూడా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తే, ఈ మోడల్ కూడా తిరిగి భారత మార్కెట్లో పూర్వవైభవాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








