హోండా మొబిలియో ఉత్పత్తి షురూ, త్వరలో విడుదల!
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా, తమ బ్రయో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన మొబిలియో (Mobilio) ఎమ్‌పివిని గడచిన ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. త్వరలోనే ఈ ఎమ్‌పివిని మార్కెట్లో విడుదల చేయనున్న నేపథ్యంలో, కంపెనీ ఇప్పటికే గ్రేటర్ నోయిడాలోని ప్లాంట్‌లో మొబిలియో ఎమ్‌పివి ట్రైల్ ప్రొడక్షన్‌ను కూడా కంపెనీ ప్రారంభించింది.
రానున్న మే-జూన్ నెలల్లో ఇది కస్టమర్ల చెంతకు రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, హోండా మొబిలియో ఎమ్‌పివి కోసం కంపెనీ ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించి అందులో 'మరికొద్ది నెల్లోనే విడుదల చేస్తామంటూ' ఓ టీజర్‌ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసినదే. హోండా మొబిలియో వెబ్‌సైట్‌లో ఆ ఎమ్‌పివికి సంబంధించి ఎక్స్టీరియర్, ఇంటీరియర్ వివరాలతో పాటుగా ఓ డెమో వీడియోను అందుబాటులో ఉంచారు.

హోండా మొబిలియో 7-సీటర్ ఆప్షన్‌తో ఈ సెగ్మెంట్లో నేరుగా మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివికి పోటీగా నిలువనుంది. మొబిలియోను బ్రయో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు కాబట్టి, దీనిని ముందు వైపు నుంచి చూస్తే ఇది బ్రయో మాదిరిగానే అనిపిస్తుంది. ప్రస్తుతం కొత్త తరం హోండా సిటీ సెడాన్‌లో ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే ఈ కొత్త మొబిలియోలోను ఉపయోగించనున్నారు.
పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-విటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 116 బిహెచ్‌పిల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 97 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.5.90 లక్షలు ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








