హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.12 లక్షల వరకు సబ్సిడి!
మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే, పర్యావరణ సాన్నిహిత్య వాహనాలను రూపొందించేందుకు తయారు చేసిన ప్రణాళిక 'నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ 2020'ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ సబ్సిడీ లభించనుంది.
ఈ సబ్సిడీ సీలింగ్‌కు ఇప్పటికే భారీ పరిశ్రమల శాఖ మరియు ఆటోమొబైల్ పరిశ్రమల శాఖలు అంగీకరించినట్లు సమాచారం. ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.8,000 మొదలుకొని రూ.12 లక్షల వరకు సబ్సిడీలు లభించే ఆస్కారం ఉంది.

ఉదాహరణకు రూ.7.5 లక్షల ఖరీదు చేసే హైబ్రిడ్ కార్, ఎస్‌యూవీలపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు సబ్సిడీని అలాగే రూ.40,000 వరకు ఖరీదు చేసే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై రూ.30,000 వరకు సబ్సిడీని ఆఫర్ చేయవచ్చని సమాచారం. అదేవిధంగా, హైబ్రిడ్ బస్సులపై గరిష్టంగా రూ.12 లక్షల వరకు మరియు తేలికపాటి హైబ్రిడ్ వాణిజ్య వాహనాలపై రూ.1 లక్ష వరకు సబ్సిడీని ఆఫర్ చేసే అవకాశం ఉంది.
ప్రతి వాహనం అందించే సబ్సిడి అనేది కేవలం దాని వాస్తవిక ధరపైనే కాకుండా, అది ఆఫర్ చేసే రేంజ్ మరియు బ్యాటరీలపై కూడా ఆధారపడి ఉంటుంది. పెట్రోల్/డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే హైబ్రిడ్/ఎలక్ట్రిక్ వాహనాలపై ఇచ్చే సబ్సిడీ మొత్తం సుమారు 30 శాతం నుంచి 40 శాతం వరకు ఉంటుంది. ఇదే గనుక జరిగితే అనేక కొత్త కంపెనీలు ఈ విభాగంపై దృష్టి సారించే అవకాశం ఉంది.

ప్రస్తుతం భారత్‌లో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ కార్లను ఆఫర్ చేస్తున్న కంపెనీ మహీంద్రానే. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వగలిగితే, భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తామని గతంలో మహీంద్రా పేర్కొంది. అలాగే, టాటా మోటార్స్ కూడా ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వాహనాలను తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. మహీంద్రా ప్యాసింజర్ వాహన విభాగంలో ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వాహనాలను తయారు చేయనుండగా, టాటా మోటార్స్ వాణిజ్య వాహన విభాగంలో దూసుకుపోనుంది.


Click it and Unblock the Notifications








